తిరుచానూరులో అక్రమ మద్యం తయారీ గుట్టు రట్టు


విశాలాంధ్ర -తిరుపతి కలెక్టరేట్: తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో సుమారు 34.75 లీటర్ల అక్రమ మద్యం మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డిపిఎల్) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డిఎస్పి ప్రసాద్, తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బి. సునీల్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం తిరుచానూరు సబ్ ఇన్‌స్పెక్టర్ టి.వి. సుధాకర్ సిబ్బందితో కలిసి శేషాద్రి నగర్ ఇందిరమ్మ కాలనీలో (కార్డన్ అండ్ సెర్చ్) మెగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ నెం.40, ఇంటి నెం.ఎఫ్-8 వద్ద సోదాలు చేయగా ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం, గోపాలపట్నం ప్రాంతానికి చెందిన చింతగుంట రామస్వామి నగేష్ రెడ్డి (39)ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్ల ద్రాక్ష, చక్కెర, గోధుమలు, ఈస్ట్‌తో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి డ్రమ్ములో పులియబెట్టి ఇంట్లోనే మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాత సీసాల్లో నింపి తెలిసిన వారికి రూ.300కు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దాడుల్లో 1000 మిల్లీ లీటర్ల సామర్థ్యం గల 4 బాటిళ్ల ఎన్డిపీఎల్ లిక్కర్, 750 మిల్లీ లీటర్ల సామర్థ్యం గల 33 బాటిళ్ల నాటు మద్యం, అలాగే డ్రమ్ములో ఉన్న పులియబెట్టిన మద్యం, మద్యం తయారీకి ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై క్రైమ్ నెంబర్. 56/2026, యు/ఎస్ 34(ఈ), 35 ఎపి ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా, ఈ ఘటనపై తదుపరి విచారణను పోలీసులు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *