తగ్గని యుద్ధ జ్వాలలు – Visalaandhra


ఇరాన్‌పై విరుచుకుపడుతోన్న అమెరికా`ఇజ్రాయిల్ దళాలు
ప్రతీకార దాడులు కొనసాగిస్తోన్న ఇరాన్
గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన తెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లు

దుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఉధతమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. యుద్ధం 14వ రోజైన శుక్రవారం తెహ్రాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్, తెలఅవీవ్ యుద్ధవిమానాలతో దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఒమన్‌పై తెహ్రాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. పశ్చిమ ఇరాక్‌లో అమెరికా రీఫ్యూయెలింగ్ విమానమొకటి కూలిపోవడంతో.. అందులోని ఆరుగురు అమెరికా సిబ్బంది మృత్యువాతపడ్డారు. మరోవైపు- ఇరాన్ త్వరలోనే లొంగిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. అమెరికా విమానవాహక నౌక అబ్రహం లింకన్‌పై తాము బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని, ప్రస్తుతం అది పనిచేయడం లేదని ఇరాన్ పేర్కొంది. ఆ ప్రకటనను వాషింగ్టన్ తోసిపుచ్చింది.
ఇరాన్ రాజధాని తెహ్రాన్‌ను భారీ పేలుడు కుదిపేసింది. ‘ఇంటర్నేషనల్ కుద్స్ డే’ సందర్భంగా పలస్తీనియన్లకు మద్దతుగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. నగరంలోని ఫిర్దౌసీ స్క్వేర్ ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన వార్షిక ర్యాలీకి వేలమంది హాజరయ్యారు. వారిని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు.
ప్రతిదాడులతో విరుచుకుపడ్డ ఇరాన్:
ఇజ్రాయెల్‌లోని జర్జిర్ ప్రాంతంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడితో ఓ ఇల్లు ధ్వంసమైంది. ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులను ఇరాన్ ముమ్మర స్థాయిలో కొనసాగించింది. గల్ఫ్‌లో ప్రధానంగా చమురు కేంద్రాలు, ఇతర మౌలిక వసతులను అది లక్ష్యంగా చేసుకుంటోంది. తమ దేశంపైకి పలు విడతల్లో దూసుకొచ్చిన దాదాపు 50 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇరాన్ శుక్రవారం తమపైకి 7 బాలిస్టిక్ క్షిపణులు, 27 డ్రోన్లను ప్రయోగించినట్లు యూఏఈ తెలిపింది. దుబాయ్‌లోని ఓ పారిశ్రామిక ప్రాంతంపైకి దూసుకొచ్చిన డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నారు.
తుర్కియేపైకి ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని తూర్పు మధ్యదరా ప్రాంతంలో మోహరించి ఉన్న నాటో రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా బలగాలపై 44వ విడత క్షిపణి దాడులు చేపట్టినట్లు ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఒమన్‌లోని సోహర్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమాసియా నుంచి 1.50 లక్షల మంది భారతీయులు స్వదేశానికి వచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అసీం మహాజన్ వెల్లడించారు. ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య పోరు మరింత తీవ్రస్థాయికి చేరింది. హెజ్‌బొల్లా రాకెట్ దాడులతో ఉత్తర ఇజ్రాయెల్‌లో దాదాపు 60 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఓ వ్యక్తి మరణించారు.
ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా ఉపయోగిస్తున్న రీఫ్యూయెలింగ్ విమానం కేసీ-135 పశ్చిమ ఇరాక్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో అందులోని ఆరుగురు సిబ్బంది మృత్యువాతపడ్డారు. ట్యాంకర్ విమానం కూలిపోవడానికి శత్రువుల దాడి కారణం కాదని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *