Last Updated:
విశాఖపట్నంలో టమాటా ధరలు కిలో రూ.8లోపే ఉన్నాయి. రైతు బజార్లలో రూ.5కే విక్రయిస్తున్నారు. టమాటా సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు పడిపోయాయి. వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త.
వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త.. ఒకప్పుడు కిలో రూ.200 వరకు ఎగబాకిన టమాటా ధరలు ఇప్పుడు కుప్పకూలాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో టమాటా ధరలు కిలోకు రూ.8లోపే ఉండగా, కొన్ని చోట్ల రైతు బజార్లలో రూ.5కే విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా టమాటాలే కనిపిస్తుండటంతో మార్కెట్‌లో ధరలు పూర్తిగా పడిపోయాయి.
కూరగాయల్లో టమాటాకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి వంటలో టమాటా అవసరం ఉండటంతో ఇది నిత్యావసరంగా మారింది. అయితే గతంలో టమాటా ధరలు అమాంతం పెరిగి వినియోగదారులను కుదిపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి టమాటానే ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు లభిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం విశాఖలో కిలో టమాటా రూ.8కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండటం వినియోగదారులకు పెద్ద ఊరటగా మారింది.
ఇదీ చదవండి:
రైతుల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. భారీగా దిగుబడి రావడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా టమాటా సరఫరా ఎక్కువగా రావడం వల్ల మార్కెట్‌లో నిల్వలు పెరిగిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్వ ఉంచడం కంటే తక్కువ ధరకైనా అమ్మేయాలనే పరిస్థితి రైతులకు ఏర్పడింది. సరైన ధర లభించకపోవడంతో వచ్చిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
విశాఖపట్నం పరిసర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద మొత్తంలో టమాటాలు రావడం వల్ల మార్కెట్ నిండిపోయింది. దీంతో డిమాండ్ కంటే సరఫరా ఎక్కువై ధరలు క్రమంగా పడిపోయాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా టమాటాలు విరివిగా కనిపించడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.
విశాఖలోని 22 రైతు బజార్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత పది రోజులుగా టమాటా ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎంవిపి కాలనీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు మాట్లాడుతూ, కొన్ని సందర్భాల్లో టమాటా కిలో రూ.5కే అమ్ముతున్నారని తెలిపారు. డిమాండ్‌కు మించి దిగుబడి రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు.
ఇది వినియోగదారులకు మంచి అవకాశమని, రైతుల దగ్గర నుంచి టమాటాలను విరివిగా కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చని, ఏప్రిల్-మే తర్వాత మళ్లీ ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు టమాటా కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


