. ఫైనల్‌లో టీమిండియా దెబ్బకు కివీస్ విలవిల
. 96 పరుగుల తేడాతో సూర్యసేన ఘన విజయం
. అభిషేక్, ఇషాన్, సంజూ ఊచకోత
. బుమ్రా`4, అక్షర్‌కు 3 వికెట్లు
అహ్మదాబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి 96పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకోవడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2007, 2024లో భారతజట్టు చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 255 పరుగుల భారీ స్కోరు సాధించగా… 256 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ 19ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, అక్షర్ మూడు వికెట్లు పడగొట్టగా… వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలుత బ్యాటర్లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన వేళ టీమఇండియా రికార్డు స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 255 భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (89 పరుగులు), ఇషాన్ కిషన్ (54 పరుగులు), అభిషేక్ శర్మ (51 పరుగులు) ముగ్గురు అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3, హెన్రీ, రచిన్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.
ఓపెనర్లు అదరహో
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్, శాంసన్ అద్భుతమైన ఆరంభం అందించారు. గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగిస్తూ శాంసన్ మరో భారీ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. మరోవైపు వరుసగా విఫలమవుతూ వస్తున్న అభిషేక్ ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో మెరిశాడు. అతడు 18 బంతుల్లోనే 51పరుగులు చేశాడు. తొలి రెండు ఓవర్లలో ఇన్నింగ్స్ చప్పగా సాగినా, మూడో ఓవర్లో అసలైన విధ్వంసం మొదైలంది. అభిషేక్, శాంసన్ పోటీపడుతూ మరీ బౌండరీలు బాదారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 98 పరుగుల జోడించారు. 7.1 వద్ద రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అభిషేక్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన ఇషాన్‌తో కలిసి శాంసన్ విధ్వంసం కొనసాగించాడు. ఇషాన్ కూడా వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే శాంసన్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతడికిది ఈ టోర్నీలో వరుసగా మూడో అర్ధ సెంచరీ. ఆ తర్వాత శాంసన్ గేరు మార్చాడు. రచిన్ వేసిన 15వ ఓవర్లో వరుగా మూడు సిక్స్‌లు బాదాడు. ఇదే జోరులో ఇషాన్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 15 ఓవర్లకు భారత్ 203-1 స్కోర్‌తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే అప్పుడే బంతి అందుకున్న నీషమ్ భారత్‌ను తీవ్రంగా దెబ్బ కొట్టాడు. తొలి బంతికే శాంసన్‌ను అతడు ఔట్ చేశాడు. బారీ షాట్‌కు ప్రయత్నించిన శాంసన్ 89 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఇక క్రీజులో కుదురుకున్న ఇషాన్ (54) అదే ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్య వచ్చీ రావడంతోనే భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బౌండరీ లైన్ వద్ద రచిన్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒకే ఓవర్లో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ ఓవర్లో ఒకే పరుగు వచ్చింది.
చివర్లో దూబే అదుర్స్
అయితే 16వ ఓవర్లో మరో రెండు వికెట్లు పడడంతో స్కోర్ వేగం తగ్గింది. కానీ పాండ్య ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దూబే ఆఖరి ఓవర్లో ఇరగదీశాడు. నీషమ్ వేసిన ఈ ఓవర్లో వరుసగా 4,6,6,4,0,4 బాదేశాడు. దీంతో ఆఖరి ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోర్ 250 దాటింది. దూబే 8 బంతుల్లో 26 పరుగులు బాదాడు.


