. తప్ప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
. ఐజేయూ ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మీడియాలో వచ్చే కథనాలను తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, అదేసమయంలో పత్రికా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుత మీడియా పోకడల పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడు దశాబ్దాలుగా తనకు జర్నలిస్టులతో ఉన్న విడదీయలేని అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి తాము వేసిన పునాదుల ఫలితాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నట్లు ఐజేయూ ప్రతినిధులు ప్రశంసించడం సంతోషకరమని పేర్కొన్నారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి మరణం విషయంలో జరిగిన తప్ప్పుడు ప్రచారాన్ని ఉదాహరణగా చూపుతూ… అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించే ధోరణి సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. గత ప్రభుత్వం మీడియాను కట్టడి చేసేలా తెచ్చిన జీవో నెంబర్ 2430ని ప్రస్తావిస్తూ… తమది జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, విలేకరులకు ప్రశ్నించే స్వేచ్ఛను తిరిగి కల్పించామని చెప్పారు.
ఇప్పటికే మండల రిపోర్టర్లకు అక్రిడిటేషన్లు ఇవ్వడంతో పాటు జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేశామన్నారు. మంత్రుల క్వార్టర్ల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా ప్రెస్‌క్లబ్‌కు ఇచ్చామని గుర్తు చేశారు. అమరావతిలో ఐజేయూ కార్యాలయానికి స్థలం కేటాయించే అంశాన్ని సబ్ కమిటీకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్ప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇప్ప్పుడు రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు ఉంటున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మీడియాలో పడిపోతున్న విలువలు, సిద్ధాంతాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీడియానే ప్రపంచానికి తెలియచేయాలన్నారు. వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందుతోందని, జరుగుతున్న అభివృద్ధిని జర్నలిస్టులు అధ్యయనం చేసి విశ్లేషించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధిలో మీడియా భాగస్వామ్యం కావాలన్నారు. కేవలం సానుకూల వార్తలు మాత్రమే కాకుండా ‘ప్రగతిశీల’ (అభివృద్ధిని కాంక్షించే) వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో అమరావతి అద్భుతమైన ఫ్యూచర్ సిటీగా మారుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. సభలో మంత్రులు కొలుసు పార్ధసారథి, నిమ్మల రామానాయుడు, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా ఆకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ ఉపాధ్యక్షుడు అమర్ మోహన్ ప్రసాద్, ఏపీ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్ము, యూనియన్ సీనియర్ నేతలు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్వసభ్యులు ఎసఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, ఎంఏ మాజిద్, ఇటీవల ఐజేయూ సెక్రటరీ జనరల్‌గా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ పాత్రికేయులు డి.సోమసుందర్, ఐజేయూ కార్యదర్సులు వై.నరేంద్రరెడ్డి, బల్బీర్ సింగ్ జండు, డీఎసఆర్ సుభాష్, జైసింగ్ రావత్, ఐజేయూ ప్లీనరీ స్క్రీనింగ్ కమిటీ నేతలు ఎసఎన్ సిన్హా, ఏపీయూడ్ల్యుజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు ఐవీ సుబ్బారావు, కె.జయరాజ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు ఆర్.పిచ్చయ్య, చంద్రనాయక్, పల్లె నర్సింహ ఆలపించిన గేయాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
The post జర్నలిజంలో విలువలపునరుద్ధరణ అవశ్యం appeared first on Visalaandhra.


