బాలిక హత్యాచారం కేసులో ఊహించని మలుపు
విశాలాంధ్ర బ్యూరో-అన్నమయ్య: మదనపల్లిలో బాలిక(7)పై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక హత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు కులవర్ధన్ విగతజీవిగా కనిపించాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ధృవీకరించారు. చిన్నారి ప్రాణాన్ని బలిగొని క్రూరుడిగా వార్తల్లోకెక్కిన కులవర్ధన్… బాలిక హత్య అనంతరం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పోలీసు బందాలు అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన తరుణంలో, మృతదేహం చెరువులో తేలియాడుతుందన్న సమాచారం అందింది. పోలీసుల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. తప్పించుకునే మార్గం లేక, పోలీసులకు దొరికిపోతాననే భయంతో ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఇది ఆత్మహత్యా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది స్పష్టమవుతుంది.
కులవర్ధన్‌ది ఆత్మహత్యే: జిల్లా ఎస్పీ
నిందితుడు కులవర్ధన్ మృతదేహం బుధవారం కనసానివారిపల్లె చెరువులో లభ్యమైన విషయాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. నిందితుడు మృతి చెందినప్పటికీ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో ఇటువంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు , చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ ధీరజ్ తెలిపారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) యం. వెంకటాద్రి, మదనపల్లి డీఎస్పీ యస్. మహేంద్ర, సీఐలు, ఎసఐలు సమావేశంలో పాల్గొన్నారు.
తీవ్రంగా పరిగణించాం: హోంమంత్రి అనిత
మదనపల్లెలో చిన్నారిపై ఘాతుకాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయికి అలవాటు పడిన కులవర్ధన్ ఈ ఘటనకు పాల్పడ్డాడన్నారు. తర్వాత మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.
ముగిసిన అంత్యక్రియలు
హత్యాచారానికి గురైన బాలిక అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. ఆమె స్వగ్రామమైన కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.అంత్యక్రియలకు ముందే నిందితుడు కులవర్ధన్ మృతిచెందాడు. అంత్యక్రియలకు బంధువులు, స్థానికులు, అన్నమయ్య, కడప జిల్లాల టీడీపీ నేతలు హాజరయ్యారు.
The post చెరువులో నిందితుడి మృతదేహం appeared first on Visalaandhra.


