తాడి ప్రకాష్
సెల్: 9704541559
తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను. “ఇంకెవరు! రాంభట్ల కష్ణమూర్తిగారేగా” అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా! ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి “మీతో అదే వచ్చింది” అన్నారు. మీతో అంటే కమ్యూనిస్టులతో అని ఆయన ఉద్దేశం. “మొట్టమొదట రాసింది నేను” అని నండూరి చెప్పారు. 1956 లోనో 57 లోనో రాశానని వివరంగా తెలియజెప్పారు. నడుస్తున్న రాజకీయాల మీద ఒక కామెంటరీలా, చురకలతో, మెరుపులతో ఎనిమిది లైన్ల పొట్టి కవితలు రాయడం ఆనాడే మొదలైంది. నండూరి, ఆరుద్ర, రాంభట్ల రాసినవి జనానికి నచ్చాయి. పాపులర్ అయ్యాయి. ఆ వరసలోనే ‘ఆంధ్రప్రభ, ఉదయం’ దినపత్రికల్లో కవి దేవిప్రియ రాసిన చిట్టి కవితలకు ఆర్టిస్ట్ మోహన్ వేసిన బొమ్మలు ఒక ఊపు ఊపాయి. ఒక ట్రెండ్ సెట్ చేశాయి. దినపత్రిక మొదటి పేజీలో ఒక మూల ఉండే పాకెట్ కార్టూన్‌కి బదులు ఇలా రన్నింగ్ కామెంటరీ ఉండాలని దాదాపు అందరు సంపాదకులూ అనుకున్నారు. సాయంత్రం పార్టీల్లో ఆ పొట్టి కవితల్ని కోట్ చేయడం, ఆహాహోహో అనుకోడం…అలా నడిచాయి అప్పటి రోజులు1980 నుంచి 2000 సంవత్సరందాకా ఈ జోరు నడిచింది. కార్టూన్ వేయడం, మరీ ముఖ్యంగా పొలిటికల్ కార్టూన్‌తో ఒప్పించడం అంత ఈజీకాదు. భార్యభర్తలు, పక్కింటి లావుపాటి పిన్నిగారు, చిన్నపిల్లల సరదా కార్టూన్లు చాలామంది వేశారు. పొలిటికల్ కార్టూన్ పూర్తిగా వేరు. పీవీ నరసింహారావో, ఇందిరా గాంధీనో, ఎన్టీఆరో...కార్టూన్ బొమ్మలో పోలిక బాగా రావాలి. ఐడియాపేలాలి. అనగా నడుస్తున్న రాజకీయాల మీద ఆర్టిస్టుకి అవగాహన ఉండాలి. మన వెకిలి, మకిలి, దరిద్రపు రాజకీయాల మీద కామెంట్ చేయగలిగే శక్తి ఉండాలి. అంచేత పొలిటికల్ కార్టూనిస్టు అనే వాడు అరుదైన ‘సోషల్ యానిమల’ అన్నమాట. ఒక శంకర్‌పిళ్లై, ఆర్కే లక్ష్మణ్, అబూ అబ్రహాం లాంటి అతి కొద్దిమంది మన జాతీయ రాజకీయ కార్టూనిస్టులుగా పేరుపొందారు. తెలుగులో మంచి కార్టూనిస్టులు చాలామంది ఉన్నా, రాజకీయ వ్యంగ్య చిత్రాలు వేయగలిగే మొనగాళ్లు అతి కొద్దిమంది మాత్రమే. ఆ ఐదారుమందిలో ఒక పొడుగుపాటి శక్తిమంతుడైన చిత్రలేఖకుడు సురేంద్ర. కడప జిల్లాకి చెందిన, మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న సురేంద్ర తెలుగు పత్రికల్లో 14 సంవత్సరాలు పనిచేశారు. లెక్కలేనన్ని బొమ్మలూ, కేరికేచర్లూ, కార్టూన్లూ వేశారు. సురేంద్ర సాధించిన ఒక విజయం గురించి తప్పకుండా చెప్ప్పుకోవాలి. కలం భుజాన వేసుకుని మద్రాసు రైలెక్కిన సురేంద్ర జాతీయ దినపత్రిక హిందూలో ఏకంగా 28 సంవత్సరాలు పొలిటికల్ కార్టూన్లు వేశారు. దేశంలోని మంచి కార్టూనిస్టుల్లో ఒకడిగా పేరు పొందారు. ముఖ్యంగా 1990 వ దశకంలో కవి గజ్జెల మల్లారెడ్డి విజంభించి రాసిన ‘అక్షింతలు’ అనే పొట్టి కవితలకి అర్థవంతమైన బొమ్మలు వేశాడు. నలుపు తెలుపు రేఖా విన్యాసంతో సూపర్ కార్టూనిస్ట్ సురేంద్ర అనే పేరు తెచ్చుకున్నాడు. మనందరం రోజువారీ జీవితాన్నీ, రాజకీయాల్నీ చూస్తాం. కార్టూనిస్టు అనే వాడిది వంకర చూపు. ఆ పదునైన చూపే మనల్ని నవ్విస్తుంది. కొత్త దారుల్లో నడిపిస్తుంది. బతుకులోని విషాదాన్ని చూసి కూడా నవ్వుకునే శక్తిని ప్రసాదించేవాడే వ్యంగ్య చిత్రకారుడు. 40, 50 ఏళ్ల క్రితం ప్రముఖ రచయితగా మెలిగిన పి.రామకష్ణారెడ్డిగారి అబ్బాయి సురేంద్ర. అసలే కడప, పైగా రెడ్లు... అయితే గియితే ఫ్యాక్షనిస్టులు కావాలి గానీ, రచయితలూ కార్టూనిస్టులూ అవుతారా అని మన సమాజం ఆశ్చర్యపోవచ్చు. మన చిల్లర తెలుగు సినిమాలు తెచ్చిపెట్టిన దరిద్రం అది. పుట్టపర్తి నారాయణాచార్యులు, రాచమల్లు రామచంద్రారెడ్డి, సొదుం రామ్మోహన్, సొదుం జయరాం నుంచి కేతు విశ్వనాధరెడ్డి, పి.రామకష్ణా రెడ్డిగారి దాకా అందరూ గొప్ప సాహితీవేత్తలు. సహదయులు. కరుణ నిండిన మనుషులు. ఆ అద్భుతమైన తరానికి తగిన వారసుడే సురేంద్ర. తక్కువ మాట్లాడతాడు, చిన్నగా జోకేస్తాడు. స్నేహితుడు అంటే ఎలా ఉండాలో అలా ఉండే ఆత్మీయుడే సురేంద్ర. గజ్జెల మల్లారెడ్డి సొంత వూరు సింహాద్రి పురం మండలంలోని అంకాలమ్మ గూడూరు. ఆ వూరికి దగ్గరలోనే ‘ఎద్దులయ్యగారి కొత్తపల్లి’ ఉంది. అది తెలుగు సినీ లెజెండ్స్ విజయా నాగిరెడ్డి, ఆయన అన్న బి.ఎన్.రెడ్డిల స్వగ్రామం. ఆ పక్కనే పైడిపాలెం రాచమల్లు రామచంద్రారెడ్డి వూరు. ఆ పక్కనే సురేంద్ర గ్రామం. తెలుగు నాటక కళాకారుల ప్రతిభని ప్రపంచానికి చాటిన ‘సురభి’ గ్రామమూ అక్కడే ఉంది. కడప రెడ్లంతా నెత్తురు తాగే ఫ్యాక్షనిస్టులు కారని ఇందుమూలముగా తెలియజేయడమైనది. మల్లారెడ్డి ‘అక్షింతలు’ కవితలతో, సురేంద్ర బొమ్మలతో అందంగా డిజైన్ చేసిన 400 పేజీల పుస్తకం వచ్చింది. అందులో కాంగ్రెస్ పార్టీ మీద మల్లారెడ్డి విసురు: ఎవరైనా కాంగ్రెసులో ఎపుడైనా చేరవచ్చు. తలుపుల్లేని గుడిసెలో దర్జాగా దూరవచ్చు. అదో పెద్ద ఊర చెరువు ఏమైనా చెయ్యవచ్చు. అదో ధర్మసత్రం ఎవరైనా భోంచెయ్యొచ్చు. దీనికి సురేంద్ర వేసిన బొమ్మ: కప్పలు నిండిన చెరువు గట్టున ఉన్న ఒక కప్ప, “మే ఐ కమిన్?” అని అడుగుతుంటుంది. 1989 ఎన్నికల్లో ఎన్టీరామారావు ఓడిపోయారు. అప్ప్పుడు మల్లారెడ్డి... తొడలు విరిగి కూలబడిన తెలుగు సుయోధనుని చూడు
అహంకారమతిశయించఅణగారిన దొరను చూడు తిరగబడిన తెలుగువాడు తెగులు వదిల్చాడు నేడు.
దీనికి సురేంద్ర వేసిన తొడలు విరిగిన ఎన్టీఆర్ బొమ్మ చూసి తీరాలి. వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన విధ్వంసంపై సురేంద్ర చమత్కారం చూడండి. అల్లర్లలో తగలబడిన ఆర్టీసీ బస్సు స్కెలిటన్ వేసి, ఆర్టీసీ నష్టాలు పూడ్చుకునేదాకా కొంతకాలం ఇలాగే నడుపుతారట అని కామెంట్ రాశాడు. సెన్సాఫ్ హ్యూమరూ, సురేంద్రా కవల పిల్లలు.
ఫిబ్రవరి 22 ఆదివారం నాడు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సోమాజిగూడలో ‘అక్షింతలు’ ఆవిష్కరణ సభ జరిగింది. పుస్తకం కావాలా? 9347234086 నెంబర్‌లో వాట్సాప్ మెస్సేజ్‌తో సంప్రదించండి.


