నార్పల – విశాలాంధ్ర (అనంతపురం జిల్లా): – మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ, చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్‌తో బస్సు నడిపినట్లు గమనించారు.
పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ వాహనం ఏ పాఠశాలకు చెందినదో స్పష్టత లేకపోవడం స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది, ఇది భద్రతా నిబంధనలు పాటించడంలో లోపం ఉన్నట్టు సూచిస్తోంది.తక్షణమే పాఠశాల యాజమాన్యం స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పాఠశాల బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ అర్హతలు, భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రవాణా శాఖ, విద్యాశాఖ అధికారులు సంయుక్త తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
“పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడకండి” అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తున్నారు.


