చిత్తూరుపై రైల్వేశాఖ చిన్నచూపు


ఆగని కీలక ఎక్స్ ప్రెస్ రైళ్లు
*కాట్పాడి, తిరుపతికి వెళుతున్న ప్రయాణీకులు

                       (విశాలాంధ్ర-చిత్తూరు)

జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రతిరోజూ ఈ స్టేషన్ మీదుగా పదుల సంఖ్యలో ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగు తీస్తున్నా… అందులో సగం కంటే ఎక్కువ రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ లేకపోవడం గమనార్హం. రూ.కోట్లు ఆదాయాన్ని రైల్వే శాఖకు అందిస్తున్నా… కనీసం రైళ్లు ఆపడం లేదంటే అధికారులకు ఈ ప్రాంతంపై ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోంది.

                  చిత్తూరు మీదుగా దేశంలో పలు ప్రధాన నగరాలకు రైళ్లు వెళుతుంటాయి.  ఈ స్టేషను మీదుగా రోజూ ప్రస్తుతం 19రైళ్లు వెళుతుంటాయి. అయితే వీటిలో చాలా రైళ్లు ఇక్కడ ఆగడం లేదు. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ప్రయాణిస్తుంటారు. చిత్తూరు నుంచి రోజుకు సగటున 3,600 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తూ ఉంటారని అంచనా. ఇందులో 300మందికి పైగా రిజర్వేషను చేసుకుంటారు. ఇక్కడ రోజువారీ సగటు ఆదాయం రూ.3లక్షలు వరకు ఉంటుంది. చిత్తూరులో ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణీకులు 30 కి.మీ దూరంలో ఉన్న కాట్పాడికి లేదా 70 కి.మీ దూరంలో ఉన్న తిరుపతికి సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా చెన్నై ప్యాసింజరు రైలు ఎపుడు వస్తుందో తెలియడం లేదు. తిరుపతి- రామేశ్వరం, హౌరా- పాండిచ్చేరి, ఓకా-రామేశ్వరం, తిరుపతి- రామేశ్వరం, టాటా- యశ్వంత్ పూర్, కన్యాకుమారి, హఠియా-యశ్వంత్ పూర్, హౌరా-పాండిచ్చేరి రైళ్లు చిత్తూరు మీదుగా వెళుతుంటాయి. కానీ వీటికి ఇక్కడ స్టాపింగ్ లేదు. వీటిలో ప్రయాణించాలంటే పాకాల లేదా తిరుపతి లేదా కాట్పాడి వెళ్లాల్సి వస్తోంది. 

ఆదాయం వస్తోంది అయినా…

చిత్తూరు స్టేషన్ ద్వారా నెలకు సుమారు రూ. కోటి వరకు ఆదాయం రైల్వే శాఖకు సమకూరుతోంది. అయినా సరే, కొత్త రైళ్ల హాల్టింగ్‌కు రైల్వే బోర్డు ఆసక్తి చూపడం లేదు. గతంలో అనేకసార్లు వినతులు ఇచ్చినా, అధికారులు కేవలం ‘సాంకేతిక కారణాలు’ చెప్పి తప్పించుకుంటున్నారు. జిల్లా కేంద్రం సమస్యలపై ప్రజాప్రతినిధులు రైల్వే బోర్డుపై గట్టిగా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారనే విమర్శ బలంగా ఉంది. ముఖ్యమైన రైళ్లు చిత్తూరులో ఆగేలా చూస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

The post చిత్తూరుపై రైల్వేశాఖ చిన్నచూపు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *