చట్టసభల్లో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర: వైఎస్ జగన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

YS Jagan: సభలో ఏకైక ప్రతిపక్షంగా తమ పార్టీ ఉన్నా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్ జగన్ విమర్శించారు.

Rapid Read
News18
News18

అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో ఏకైక ప్రతిపక్షంగా తమ పార్టీ ఉన్నా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. అసెంబ్లీలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ, శాసనమండలిలో పార్టీకి మంచి బలం ఉందని, అక్కడ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సభ్యులకు సూచించారు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకుని, ఆధారాలతో సహా పోరాడాలని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, పదవులు ఉంటాయని భరోసా ఇచ్చారు.

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా అబద్ధాన్ని సృష్టించి ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. కల్తీ నెయ్యి సరఫరాకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు టీటీడీకి వచ్చాయని, ఈ విషయమై సీబీఐ ఛార్జిషీటులో పేర్కొన్న అంశాలకు సమాధానం చెప్పాల్సింది ఆయనేనని డిమాండ్ చేశారు. పరీక్షల్లో విఫలమై వెనక్కి పంపిన ట్యాంకర్లు, తిరిగి వేరే డెయిరీ పేరుతో టీటీడీలోకి ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులు, అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి పాలన అంతా కుంభకోణాలతో నిండిపోయిందని, రాష్ట్రంలో అవినీతి యథేచ్ఛగా సాగుతోందని జగన్ ఆరోపించారు. విశాఖపట్నంలో రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా తన బంధువులకు చెందిన గీతమ్ విద్యాసంస్థలకు కట్టబెట్టారని విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా బరితెగించి బంధువులకు ఆస్తులు దోచిపెట్టలేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘క్యాష్.. సూట్‌కేసు.. రాజేష్.. లోకేష్’ అనే నినాదం వినిపిస్తోందని ఎద్దేవా చేశారు. భూముల పందేరం, ప్రభుత్వ వైఫల్యాలను మండలి వేదికగా గట్టిగా ఎండగట్టాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.

సభలో వైయస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే, సీఎంకు సమానంగా మాట్లాడే సమయం ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే ప్రభుత్వం ఆ హోదా నిరాకరిస్తోందని జగన్ అభిప్రాయపడ్డారు. అందుకే అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోయినా, మీడియా ద్వారా, మండలి ద్వారా ప్రజా గొంతుకను వినిపిస్తామన్నారు. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయని, భవిష్యత్తు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఈనెల 14న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ప్రభుత్వం ప్రవేశపెట్టే కేటాయింపులు, ఎన్నికల హామీల అమలుపై క్షుణ్ణంగా చర్చించేందుకు సభ్యులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *