గోవుకు శ్రీమంతం.. గోదావరిలో హృదయాన్ని హత్తుకున్న ఘటన..! Cow Lakshmi srimantham celebration goes viral in Toorpu Godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

తూర్పుగోదావరి లో గూడపాటి రామకృష్ణ దంపతులు తమ గోవు లక్ష్మి ని ఆడబిడ్డగా భావించి శాస్త్రోక్తంగా శ్రీమంతం నిర్వహించగా వేడుక సోషల్ మీడియాలో వైరల్.

రాజమండ్రిలో గోవుకు సీమంతం ఊరు వాడను ఆహ్వానించి వసంతైన విందు
రాజమండ్రిలో గోవుకు సీమంతం ఊరు వాడను ఆహ్వానించి వసంతైన విందు

ఆంధ్రప్రదేశ్‌లో సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే గోదావరి జిల్లాలు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాయి. మనుషులకు మాత్రమే చేసే శుభకార్యాలను మూగజీవులకూ నిర్వహిస్తూ హృదయాలను కదిలించే సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఒక గోవును తమ ఇంటి ఆడబిడ్డగా భావించి, ఆమె గర్భధారణ సందర్భంగా ఘనంగా శ్రీమంతం నిర్వహించిన ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.

సీతానగరం సమీపంలో నివసిస్తున్న గూడపాటి రామకృష్ణ దంపతులు తమ గోవును గోమాతగా భావిస్తూ ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నారు. ఆ గోవుకు “లక్ష్మి” అని పేరు పెట్టి ఇంటి సభ్యురాలిగా చూసుకుంటున్నారు. ఇటీవల లక్ష్మి గర్భం దాల్చడంతో, మనుషులకు చేసే విధంగానే శ్రీమంతం వేడుకను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

వాకిట్లో పందిరి వేసి, పచ్చని బంతిపూలతో అందంగా అలంకరించి, చక్కని ముగ్గులతో ఆవరణను తీర్చిదిద్దారు. అనంతరం గోవైన లక్ష్మిని ఆహ్వానించి, అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 19 రకాల స్వీట్లు సమర్పించి, మంగళహారతులు ఇచ్చి సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ వేడుకలో ప్రతి అంశం శాస్త్రోక్తంగా నిర్వహించడం అందరినీ ఆకర్షించింది.

ముత్తైదువులను ఆహ్వానించి పసుపు, కుంకుమ సమర్పించి, నిండు తాంబూలాలు అందజేశారు. అరటిపండ్లు, తమలపాకులు, పెసలు, పచ్చని పట్టుచీరలతో మహిళలను సత్కరించి మా లక్ష్మికి సుఖ ప్రసవం కావాలి అంటూ ఆశీర్వాదాలు తీసుకున్నారు. గోవును ఒక ఆడబిడ్డగా భావించి ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించడం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది.

ఈ కార్యక్రమానికి వందలాది మంది హాజరై గోవును ఆశీర్వదించడం విశేషం. వీకెండ్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ ప్రత్యేక వేడుకను వీక్షించారు. మూగజీవులపై ప్రేమను ఇలా ఆచరణలో చూపించడం నిజంగా ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసించారు. మనుషులకే పరిమితమవుతున్న సంప్రదాయాలను మూగజీవులకు కూడా వర్తింపజేస్తూ, ప్రేమకు హద్దులు లేవని ఈ దంపతులు నిరూపించారు. గోదావరి ప్రాంత ప్రజల మనసులో ఉన్న దయ, ఆప్యాయతలకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది. లక్ష్మి కోసం నిర్వహించిన ఈ శ్రీమంతం వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *