. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?
. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?
. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్
. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో అర్హత గల ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయిస్తామని 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని కూటమి ప్రభుత్వం విస్మరించడం పేదల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోంది.
ఇప్పటివరకు ప్రవేశపెట్టిన మూడు రాష్ట్ర బడ్జెట్లలోను ఈ అంశంపై స్పష్టమైన కేటాయింపులు లేకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. సొంత ఇల్లు లేక లక్షలాది మంది పేదలు అద్దె ఇళ్లల్లో నివసిస్తూ… ఆర్థికంగా చితికిపోతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 30 శాతానికి పైగా కుటుంబాలు దారిద్య్ర రేఖ (బీపీఎల్) దిగువన జీవిస్తున్నారు. బీపీఎల్ కింద సొంత ఇల్లు లేని కుటుంబాలు ప్రస్తుతం అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. అటువంటి కుటుంబాలకు ప్రభుత్వం గుర్తించి, ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు వారు నివసిస్తున్న ఇంటి అద్దెను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సీపీఐ శ్రీకారం చుట్టింది.
ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూపు
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం లబ్ధిదారులు వేచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు ఇళ్ల స్థలం కేటాయించామని ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో ఇచ్చిన స్థలాలు నివాసయోగ్యంగా లేవన్న విమర్శలున్నాయి. మౌలిక వసతులు లేకపోవడం, తాగునీటి కొరత, రహదారుల లేమి, విద్యుత్ సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో ఆ స్థలాలు ఉపయోగంలోకి రాలేకపోయాయి. పేదల ఇళ్ల స్థలాల కోసం సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం తదితర ప్రజా సంఘాల ఉద్యమాలు చేపట్టాయి. లక్షలాది మంది పేదలు తహసీల్దార్ కార్యాలయాల ద్వారా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తులు సమర్పించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరాల్లో అద్దెలు భారీగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ప్రభుత్వం జీవో నంబర్ 23ను జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల వల్ల అర్హులైన అనేక మంది పేదలు ఇంటి స్థలం పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. గతంలో ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రకటించిన విషయం తెలిసిందే. జీవో 23 అమల్లో ఉంటే ఆ లక్ష్యం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం విషయానికి వస్తే… గతంలో ఒక్క ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల సహాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటి పరిస్థితుల్లో నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగాయి. ఇనుము, సిమెంట్, ఇసుక ధరలు గణనీయంగా పెరిగాయి. కూలీల వేతనాలు కూడా అధికమయ్యాయి. రూ.4 లక్షలతో ఒక సాధారణ ఇల్లు నిర్మించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. కనీసం రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం పెంచాల్సి ఉంది. మొత్తంగా చూస్తే పేదలకు ఇళ్ల స్థలాల సమస్యనే ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించడంతో పాటు, ఇళ్ల నిర్మాణానికి 5లక్షల ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది.
పూర్తి స్థాయిలో టిడ్కో ఇళ్లు కేటాయింపులెప్పుడు ?
ఇటీవల ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్ల ను లబ్ధిదారులకు కేటాయించాలని నిర్ణయించడం శుభపరిణామం. సీపీఐ, ప్రజా సంఘాలు చేసిన పోరాటాలతో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. గతంలో ప్రారంభమైన టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టులు రాజకీయ మార్పుల కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు దాదాపు 60 శాతం వరకు పూర్తయ్యాయి. ప్రభుత్వ మార్పుల నేపథ్యంలో ఆ పనులు నిలిచిపోయాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిడ్కో పథకం కింద వేలాది ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యి లబ్ధిదారులకు అందినప్పటికీ, చాలా చోట్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో పెద్దగా ముందడుగు వేయలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హైవే-16 పక్కన రూ.168 కోట్ల వ్యయంతో నిర్మించిన టిడ్కో ఇళ్ల పెండింగ్ పనులను పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొత్తూరు తాడేపల్లిలో 2,229 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇక్కడ మొత్తం 6వేలకుపైగా టిడ్కో ఇళ్లు నిర్మిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను నిర్మాణంలోను టిడ్కో ఇళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించి..వాటిని కేటాయించాలని లబ్దిదారులు కోరుతున్నారు. టిడ్కో ఇళ్ల పేరుతో లబ్ధిదారుల నుంచి రూ.50 వేల నుంచి రూ. లక్షా 50వేలు, చాలా చోట్ల రూ.3లక్షల 50 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో టిడ్కో ఇళ్లను సంపూర్తిగా పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది.
The post గూడు ఘోష appeared first on Visalaandhra.


