Last Updated:
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 470 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో సంచలనం సృష్టించిన జంట చోరీ కేసులను పోలీసులు చివరకు ఛేదించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 470 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.
అదనపు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, రాజాం పట్టణంలోని జి.ఎం.ఆర్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న జి.ఎం.ఆర్ కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నాగేష్ దసర్వార్ మరియు జి.ఎం.ఆర్.ఐ.టి లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గడ్డం మాధవ కృష్ణారెడ్డి ఇళ్లలో ఫిబ్రవరి 1న రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఇంటి తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు డాక్టర్ నాగేష్ దసర్వార్ ఇంటి నుంచి 1278 గ్రాముల బంగారు ఆభరణాలు, గడ్డం మాధవ కృష్ణారెడ్డి ఇంటి నుంచి 245 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సంతకవిటి పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించడంతో పాటు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలను సేకరించారు. బాధితులకు ధైర్యం చెప్పిన ఎస్పీ వెంటనే కేసును ఛేదించేందుకు సీసీఎస్ పోలీసుల సహకారంతో నలుగురు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో 12 మంది ఎస్ఐలు మరియు ఇతర సిబ్బందితో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ చోరీలకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాకు చెందిన గ్యాంగ్ పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాకు వెళ్లి గ్యాంగ్ కదలికలను గమనించాయి. అదే సమయంలో రాజాం పట్టణంలో మరిన్ని చోరీలు జరగకుండా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ మరియు గస్తీని పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు నిందితులు మళ్లీ రాజాం ప్రాంతానికి వచ్చి నేరానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బూరాడపేట గ్రామ జంక్షన్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా సర్దార్పూర్ తహశీల్ ధకన్బారి గ్రామానికి చెందిన రక్ష అలియాస్ రాక్ సింగ్ (36), ఖనియాంబా గ్రామానికి చెందిన మోహన్ సింగ్ దౌదావే (28)గా గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి పోలీసులు మొత్తం 470 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో లక్ష్మీదేవి హారం, బంగారు హారం, రెండు గొలుసులు, ఐదు గాజులు, ఒక బ్రాస్లెట్, రెండు బంగారు ఉంగరాలు, చెవి బుట్టలు, ఒక వజ్రపు ఉంగరం, 12 బంగారు నాణేలు మరియు ఒక పాపిడి బిళ్ళ ఉన్నాయి. ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర, ఎస్ఐలు ఆర్.గోపాలరావు, కే.లక్ష్మణరావు, షేక్ శంకర్, హెడ్ కానిస్టేబుళ్లు ఇమ్రాన్ ఖాన్, డి.శంకరరావు మరియు ఇతర సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు. వీరికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా త్వరలోనే రివార్డులు మరియు ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఇంటి భద్రత విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. విలువైన బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇంటిని విడిచి వెళ్లే సందర్భాల్లో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh


