వాషింగ్టన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని తాము ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీనిని హఠాత్పరిణామంగా వర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్‌పై ఇరాన్ ప్రతిదాడులు తమను షాక్‌కు గురిచేశాయని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుందని ఏ మాత్రం ఊహించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని అన్నారు. తమ దాడులను ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పరిమితం చేసేందుకు అమెరికా జోక్యం దోహదమైనదంటూ తమ దాడులను సమర్థించుకున్నారు. అమెరికా రంగ ప్రవేశంతో గల్ఫ్ దేశాలకు ముప్ప్పు తగ్గిందని చెప్ప్పుకున్నారు. ఇరాన్ నుంచి ఈ స్థాయి ప్రతిఘటనను ఊహించినాగానీ తమ వైఖరిలో మార్పు ఉండేది కాదని ట్రంప్ వెల్లడించారు. ఈ యుద్ధం ఇప్పటికప్ప్పుడు ముగిసిపోదు కానీ అంతం త్వరలోనే జరుగుతుందని ఆయన దీమాగా చెప్పారు.
క్యూబా స్వాధీనానికి ట్రంప్ హెచ్చరిక
క్యూబా హస్తగతానికి ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. తాను అనుకుంటే ఏమైనా చేయగలనని హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవల వెనిజులా అధినేతను నిర్భందించిన ఆయన ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చమురు సంక్షోభానికి తెరతీశారు. క్యూబా విద్యుత్ సంక్షోభంలో కూరుకున్న వేళ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే సువర్ణావకాశం తనను వరించబోతోందని ట్రంప్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండటం సంచలనంగా మారింది. క్యూబా చాలా బలహీనంగా ఉందని, తాను అనుకుంటే ఏమైనా చేయొచ్చని ఆయన చెప్ప్పుకున్నారు. అయితే క్యూబాకు విముక్తి ప్రసాదించాలా లేక స్వాధీనం చేసుకోవాలా అన్నది నిర్ణయించలేదన్నారు. వివిధ రకాల ఆంక్షలతో అనేక దశాబ్దాలుగా క్యూబాను అమెరికా ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల క్రమంలో జనవరి నుంచి ఇంధన సరఫరా లేక క్యూబా గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. ఆ దేశం అంధకారంలో చిక్కుకున్నది. నిత్యం 20 గంటల విద్యుత్ కోతలు అనుభవిస్తోంది. అయితే ఒక వైపు క్యూబాతో చర్చలు జరుపుతూనే ఆ దేశాన్ని స్వాధీనపర్చుకుంటామని ట్రంప్ హెచ్చరికలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాతో చర్చలు జరుగుతున్నట్లు క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానాల్ ధ్రువీకరించారు.
రెండు దేశాల చర్చలు బాధ్యతాయుతంగా సాగుతున్నాయని చెప్పారు. ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా మిగుల్ ఆలోచన ఉన్నది కానీ అమెరికా వైఖరి అందుకు భిన్నంగా తోస్తోంది. మిగుల్ను అధ్యక్షుడిగా తప్పించడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత క్యూబాపై గురి పెట్టాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఆ దేశంలో ఒప్పందం చేసుకుంటామా లేదా అనేది ప్రశ్నార్థకమని స్వయంగా ఆయనే చెప్ప్పుకుంటున్నారు. క్యూబాలో అధికార మార్పిడికి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
The post గల్ఫ్‌పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్ appeared first on Visalaandhra.


