Last Updated:
పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశిగా ప్రసిద్ధి, భూగర్భ శివలింగం, పుట్టిదార, కోటిలింగాల ఘాట్, మహాశివరాత్రి ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి గ్రామంలో కొండల నడుమ వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి క్షేత్రం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ప్రకృతి సోయగాలు, గాఢమైన ఆధ్యాత్మిక చరిత్ర కలిసిన ఈ పవిత్ర స్థలాన్ని భక్తులు దక్షిణ కాశిగా పిలుస్తారు. విజయనగరానికి సుమారు 35 కి.మీ, శృంగవరపుకోటకు 4 కి.మీ దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునే మార్గమే ఒక ప్రత్యేక యాత్రలా అనిపిస్తుంది. ఎత్తైన కొండలు, పచ్చని అరణ్యాల మధ్యలో ఉన్న ఈ దేవాలయం దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడిలో భక్తి భావాన్ని రెట్టింపు చేస్తుంది.
ఈ క్షేత్ర చరిత్ర వేల సంవత్సరాల నాటిదని స్థానికులు చెబుతారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయ నిర్మాణం 1973లో జరిగినప్పటికీ, ఇక్కడి ఆధ్యాత్మిక వైభవం ఎంతో ప్రాచీనమని అర్చకులు వివరిస్తున్నారు. ఆలయంలో స్వామివారి కింద భూగర్భంలో పాలరాతి శివలింగం వెలసి ఉందని, దానిని బయటకు తీయడం సాధ్యంకాక కాశీ నుంచి శివలింగాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించారని ప్రధాన అర్చకులు సంతోష్ కుమార్ శర్మ తెలిపారు. భూగర్భ లింగానికి జరిగే అభిషేక జలాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియని రహస్యంగా భావిస్తారు. ఈ నీటి ప్రవాహాన్ని స్థానికులు “పుట్టిదార”గా పిలుస్తారు.
ఆలయం పరిసరాల్లోని ప్రతి స్థలం ఒక పురాణ గాథను గుర్తుచేస్తుంది. కొంచెం దిగువకు వెళితే త్రినాథ స్వామి గృహం ఉంటుంది. అక్కడ పైభాగంలో ఆవు పొదుగుల ఆకారంలో రాతి నిర్మాణం, క్రింద మూడు శివలింగాలు కనిపిస్తాయి. ఆ పొదుగుల నుంచి చుక్కచుక్కగా జాలువారే నీరు నిరంతరం శివలింగాలపై పడుతూ సహజ అభిషేకం జరుగుతుండటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రకృతి స్వయంగా చేసే పూజగా దీనిని భావిస్తారు.
ఇంకాస్త దిగువన ఉన్న కోటిలింగాల ఘాట్‌కు ప్రత్యేకమైన పురాణ నేపథ్యం ఉందని చెబుతారు. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇక్కడ తపస్సు చేశాడని, మహిషాసురుడు పంది రూపంలో ప్రత్యక్షమైనప్పుడు సంభవించిన ఘటనతో శివుడు ప్రత్యక్షమయ్యాడని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఇక్కడ అస్థికలు కలిపితే కైలాసప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అస్థికలు కలిపిన తర్వాత కొన్ని రోజుల్లో అవి సున్నంలా మారిపోతాయని భక్తులు నమ్ముతారు. సమీపంలో ఉన్న దార గంగమ్మ లోయ నుంచి పూర్వం కాశికి వెళ్లే మార్గం ఉండేదని పెద్దలు చెప్పుకొస్తున్నారు.
పుణ్యగిరి క్షేత్రానికి మరో విశేషం కూడా ఉంది. ఈ స్వామివారిని దర్శించాలంటే ముందస్తు ప్రణాళిక కంటే అనుకోకుండా బయలుదేరితేనే దర్శనం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. ఎన్నో సార్లు ప్లాన్ చేసినా యాత్ర వాయిదా పడుతుందని, అనూహ్యంగా నిర్ణయం తీసుకుని బయలుదేరితే సులభంగా దర్శనం లభిస్తుందని భక్తులు అనుభవాలు పంచుకుంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని “పిలిస్తేనే పిలిచే శివుడు” క్షేత్రంగా కూడా పేర్కొంటారు.
మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల పాటు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ వేళ మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, అర్చనలు కొనసాగుతాయి. సంవత్సరం పొడవునా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఆలయం భక్తులకు తెరిచి ఉంటుంది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్ర మహిమను తెలియజేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh


