కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఏటేటా వణికిస్తున్న ఉప్పునీటి బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన సముద్రపు పోటు వల్ల సాగు భూములు చవిటి నేలలుగా మారుతున్న తరుణంలో, రూ. 2,665 కోట్ల అంచనా వ్యయంతో రెండు మినీ బ్యారేజీల నిర్మాణానికి సమగ్ర నివేదికలు సిద్ధమయ్యాయి. సముద్రంలో కలుస్తున్న 7.40 టీఎంసీల వరద జలాలను నిల్వ చేయడం ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వేలాది ఎకరాలకు అదనపు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకట్ట వేస్తూ, సాగు సాంద్రతను పెంచేలా రూపొందించిన ఈ బ్యారేజీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తీర ప్రాంతానికి కొత్త జలకళ రానుంది.
. రూ.2,665 కోట్లతో రెండు మినీ బ్యారేజీలు
. సిద్ధమైన డీపీఆర్‌లు
. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు మహర్దశ
విశాలాంధ్ర – సచివాలయం: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఏటేటా పెరుగుతున్న ఉప్పునీటి సాంద్రతకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన వృథాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టుకోవడంతో పాటు, సముద్రపు పోటు వల్ల వెనక్కి తన్నే ఉప్పునీటి ప్రభావాన్ని తగ్గించేందుకు రెండు కీలక మినీ బ్యారేజీల నిర్మాణానికి కసరత్తు పూర్తయింది. సుమారు రూ. 2,665 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుల వల్ల అటు సాగునీటి లభ్యత పెరగడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్థ్యం కేవలం 3.07 టీఎంసీలు మాత్రమే కావడంతో వరదలు వచ్చిన ప్రతిసారీ గేట్లు ఎత్తి నీటిని హంసలదీవి వద్ద సముద్రంలోకి వదలడం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. ఈ క్రమంలో ప్రవాహ ఉధృతి తగ్గినప్పుడు సముద్రపు ఉప్పునీరు నదీగర్భంలోకి వెనక్కి తన్నుతోంది. దీనివల్ల తీర ప్రాంతంలోని భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. వందలాది ఎకరాల సాగు భూములు చవిటి నేలలుగా మారి సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. దివిసీమ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. దీంతో ప్రభుత్వం రెండు ప్రధాన ప్రాంతాల్లో బ్యారేజీల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసింది.
ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీ దిగువన (చోడవరం-రామచంద్రాపురం) రూ. 1,215 కోట్లతో ఒకటి, రూ. 1,350 కోట్లతో ప్రకాశం బ్యారేజీకి 62 కి.మీ దిగువన (బండికోళ్లంక – తూర్పుపాలెం) వద్ద మోపిదేవి-రేపల్లె మధ్య మరో బ్యారేజీ పూర్తయితే సుమారు 7.40 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇప్పటికే రూ. 204 కోట్లతో సర్వే పనులు కూడా పూర్తయ్యాయి.
ఈ రెండు బ్యారేజీలతో పాటు వైకుంఠపురం వద్ద కూడా డ్యామ్ నిర్మిస్తే కృష్ణా జలాలు చుక్క కూడా వృథా కాకుండా తీర ప్రాంతం ‘రత్నాల సీమ’గా మారుతుందని సాగునీటి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త బ్యారేజీలు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం దిగువ రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకునే హక్కు ఏపీకి ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇది కేవలం సాగునీటి కోసమే కాదు, సముద్రపు ఉప్పునీరు రాకుండా అడ్డుకోవడానికి చేపట్టే పర్యావరణ అనుకూల ప్రాజెక్టు అని వాదిస్తోంది. ఈ బ్యారేజీలు కేవలం చెక్ డ్యామ్‌ల తరహాలో పనిచేస్తూ ఉప్పునీటిని అడ్డుకోవడమే కాకుండా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య కొత్త రవాణా మార్గాలుగా మారనున్నాయి.
నదిపై వంతెనల నిర్మాణం వల్ల రెండు జిల్లాల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. అలాగే గతంలో ప్రతిపాదించిన వైకుంఠపురం డ్యామును కూడా పరిగణనలోకి తీసుకుంటే కృష్ణా జలాల వృథాను అరికట్టి రాయలసీమ తరహా కరువు ముప్పును తీర ప్రాంతంలో రాకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు.
The post కృష్ణా డెల్టాలో ఉప్ప్పునీటి బెడదకు చెక్ appeared first on Visalaandhra.


