కువైట్: ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ట్రంప్ ఆడిన నాటకాలకు తలొగ్గడం లేదు. ఇటీవల చర్చలు, యుద్ధానికి ఐదు రోజులు విరామం వంటి ప్రకటనలను బేఖాతరు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, అది ఓ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో చమురు ట్యాంకర్ నుంచి భారీఎత్తున మంటలు చెలరేగాయని అక్కడి అధికారులు తెలిపారు. భారీగా పొగ వ్యాపించినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని… పరిమిత నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇక, ఇరాన్ నుంచి వచ్చిన పలు క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణవ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ దళాలు చెపుతున్నాయి. ఈ క్రమంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలిపాయి. అధికారులు జారీ చేసే… సూచలను ప్రతిఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించాయి. గల్ఫ్‌లో ఈ అలజడుల కారణంగా అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడింది. ఆ ప్రభావం భారత్‌లోనూ చూపుతోంది. క్షేత్ర స్ధాయిలో గ్యాస్ సరఫరా లేక అనేక హోటళ్లు, రోడ్డు పక్క దాబాలు ఇప్పటికే మూత పడ్డాయి. పెట్రోల్ కొరత ఏర్పడింది. బంకుల వద్ద వాహనాలు క్యూ కడుతున్నాయి. అయితే…ఇది అంత త్వరగా సమచిపోయేటట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని ప్రకటనలు ఇస్తున్నా, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు.


