కాటేసిన కల్తీ పాలు – Visalaandhra


ఐదుకు చేరిన మృతులు

ఆసుపత్రిలో 12 మందికి చికిత్స

. నలుగురు చిన్నారుల ఆరోగ్యం విషమం
. అనుమానితులు వైద్యులను సంప్రదించాలన్న అధికారులు

విశాలాంధ్ర – రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేం ద్రవరంలో కల్తీ పాల ఘటన కుటుంబాల్లో భయాందోళన రేకిత్తిస్తోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యా ప్తులో తేలింది. తాజాగా సోమవారం దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ళ శేషగిరిరావు మృతి చెందారు. అంతకుముందు చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనకరత్నం సహా మరొకరు చనిపోయారు. 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారు. వీరికి మూత్రం నిలిచిపోవడం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారిం చారు. ఆయా ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు. లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
పాలవ్యాపారి అరెస్టు
ఇదిలా ఉండగా, ఆయా కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి… ఎవరు సరఫరా చేస్తున్నారు… ఎన్ని ఇళ్లకు పాలు పోస్తున్నారు… ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేశ్… రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లల్లో పాలు పోస్తున్నట్టు తెలిసింది.
ఇంటింటికీ వైద్యపరీక్షలు: వీర పాండియన్
ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని, పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. కల్తీ పాల వల్ల ఐదుగురు మృతి చెందారని, 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పరీక్షలు నిర్వహించేందుకు విశాఖ పట్నం నుంచి ప్రత్యేక బృందం తీసుకొస్తున్నామని వెల్లడించారు. పాలు తాగిన వారందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు వైద్యులను వెంటనే సంప్రదించాలని వీర పాండియన్ సూచించారు.
ల్యాబ్‌కు నమూనాలు: కలెక్టర్
ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వై జంక్షన్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇంటింటా సర్వే నిర్వహించి 73 శాంపిల్స్ సేకరించామని వివరించారు. అలాగే పాల వ్యాపారికి చెందిన 42 గేదెల నుంచి పాలు సేకరించి.. ఆ శాంపిల్స్‌ను కూడా హైదరాబాద్ ల్యాబొరేటరీలకు పంపామ న్నారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపినట్టు చెప్పారు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *