అసోం, కోల్‌కతా సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు
కోల్‌కతా: యుద్ధాల ప్రభావం ప్రజలపై తక్కువగా పడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శనివారం ప్రధాని పర్యటించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. అసోంలో రెండు రోజుల్లో మొత్తం రూ.47,800 కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అస్సాంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను, పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. “దేశానికి సంబంధించి, అస్సాం గురించి కాంగ్రెస్‌కు ఎలాంటి దార్శనికత లేదు. మోదీని ఎలా తిట్టాలి, పుకార్లు… అబద్ధాలు ఎలా వ్యాప్తి చేయాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించే రీళ్లు ఎలా చేయాలో మాత్రమే వారికి తెలుసు” అని దుయ్యబట్టారు. ఏఐ సదస్సులో కాంగ్రెస్ నిర్వాకాన్ని దేశమంతా విమర్శించినా, ‘రాజ కుటుంబం’ మాత్రం ఆందోళనకారుల వెన్ను తట్టిందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్లపాటు అస్సాంకు ప్రాతినిధ్యం వహించినా రాష్ట్ర రైతులకు ఒక్కపైసా ఇవ్వలేదని, భాజపా రూ.20 వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని అందించిందన్నారు.
బెంగాల్ ఆటవిక పాలకులకు కౌంట్‌డౌన్…
రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును అవమానించడం ద్వారా పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ హద్దులన్నిటినీ మీరిపోయిందని ప్రధానమంత్రి మండిపడ్డారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మెగా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ… రాష్ట్రపతికి ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి గానీ, కనీసం రాష్ట్ర మంత్రి గానీ వెళ్లకుండా టీఎంసీ దేశంలోని గిరిజనులను, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిందని అన్నారు. రాష్ట్రంలోని తృణమూల్ పాలనలో అట్టడుగు వర్గాలు వేధింపులకు గురవుతున్నాయని తెలిపారు. చొరబాటుదారుల ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే ఓటరు జాబితాల సవరణకు తెచ్చిన ‘సర’ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. బెంగాల్‌కు ఆటవిక పాలన తెచ్చినవారికి కౌంట్‌డౌన్ మొదలైందని, దురాగతాలకు పాల్పడిన టీఎంసీ నాయకులను వదిలిపెట్టబోమని మోదీ హెచ్చరించారు.
The post కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది appeared first on Visalaandhra.


