శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్, ప్రకృతి సౌందర్యానికి, ఆధునిక వినోద సౌకర్యాలకు ప్రసిద్ధి చెందింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు వీకెండ్లలో ఇక్కడకు వచ్చి సంతోషంగా గడుపుతున్నారు.
సముద్ర తీరంలో అలల శబ్దం, చల్లని గాలి, విస్తారమైన ఇసుక తిన్నెలు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. కెప్టెన్ టూర్స్ ద్వారా స్పీడ్ బోటింగ్, పెడల్ బోటింగ్, ఏటీవీ రైడ్స్ వంటి వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. స్పీడ్ బోట్ రైడ్ ఒక్కొక్కరికి రూ.200, పెడల్ బోట్ రూ.200, ఏటీవీ రైడ్ ఒక్కొక్కరికి సుమారు రూ.400 చొప్పున ఛార్జ్ చేస్తున్నారు.
వంశధార నది సముద్రంలో కలిసే ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాయంత్రం వేళల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేసవి సెలవుల్లో రోజుకు కనీసం వంద మంది వరకు సందర్శకులు వస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సరసమైన ఛార్జీలతో అడ్వెంచర్ మరియు వినోద సదుపాయాలు ఉండటం వల్ల శ్రీకాకుళం ప్రజలకు ఇది ఒక ఉత్తమ పర్యాటక కేంద్రంగా మారింది.


