Last Updated:
అనంతపురం ప్రత్యేక అనంత సోనామసూరి GI ట్యాగ్ దిశగా. అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ దరఖాస్తు, మిట్స్ యూనివర్సిటీ సాంకేతిక సహాయం.
ఎప్పుడూ తక్కువ వర్షాలు, అధిక ఎండలతో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా పేరున్న అనంతపురం జిల్లా ఇప్పుడు అరుదైన ఘనత దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేలలో పండే ప్రత్యేకమైన అనంత సోనామసూరి బియ్యానికి భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు చేయడం విశేషంగా మారింది. మిట్స్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మద్దతుతో ఈ దరఖాస్తు సమర్పించబడిందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే అనంతపురం రైతులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది.
అనంతపురం ప్రత్యేక భౌగోళిక పరిస్థితులే ఈ బియ్యానికి ప్రత్యేకతను తెచ్చాయి. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, ఎర్రటి ఇసుక మట్టి, నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండే నేలలు ఇవి కలిసి ఇక్కడ పండే సోనామసూరికి ప్రత్యేకమైన నాణ్యతను ఇస్తున్నాయి. బంగారు-పసుపు మెరుపు, గట్టి గింజ నిర్మాణం, అద్భుతమైన వంట నాణ్యత, మంచి వాసనతో ఈ బియ్యం ఇప్పటికే మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
ఈ ప్రత్యేకతను రక్షించేందుకు అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థ చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసింది. మిట్స్ యూనివర్సిటీ సాంకేతిక సహాయం అందించడం ద్వారా ఈ ప్రక్రియ వేగవంతమైంది. GI ట్యాగ్ లభిస్తే ఈ బియ్యం పేరును దుర్వినియోగం చేయడం ఆపడం, రైతులకు న్యాయమైన ధరలు రావడం, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనంతపురం సోనామసూరికి మంచి డిమాండ్ ఉంది. దీనికి ప్రధాన కారణం దాని ప్రత్యేక రుచి, వాసన. వండినప్పుడు వచ్చే సువాసన ఇతర ప్రాంతాల బియ్యం కంటే భిన్నంగా ఉండి ఆకలి పుట్టించేలా ఉంటుంది. గింజలు సన్నగా, పొడవుగా ఉండటం వల్ల అన్నం వండిన తర్వాత పొడిపొడిగా వస్తుంది. అందుకే ఇది బిర్యానీలు, పులిహోర, రోజువారీ భోజనానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇంకా ఈ బియ్యంలో పిండి పదార్థం తక్కువగా ఉండటం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు పాత సోనామసూరిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నిల్వ సామర్థ్యం కూడా ఈ బియ్యం ప్రత్యేకత. ముఖ్యంగా ఏడాది గడిచిన పాత బియ్యం వండితే అన్నం ఎక్కువగా పెరిగి రుచిగా ఉంటుంది. దీంతో వినియోగదారులలో దీనికి ప్రత్యేక స్థానం ఏర్పడింది.
తుంగభద్ర డ్యామ్ ఎగువ కాలువ పరిధిలో సాగయ్యే ఈ బియ్యం నాణ్యతకు రైతులు అనుసరించే సహజ సాగు పద్ధతులే ప్రధాన కారణమని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, కరువు నేలలో పండిన ఈ సోనామసూరి ఇప్పుడు GI ట్యాగ్‌తో గ్లోబల్ గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక బియ్యం రకం విజయం మాత్రమే కాకుండా, అనంతపురం రైతుల కష్టానికి లభించే గౌరవంగా మారబోతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh



