కమలం పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘నందితా’


గౌహతి: అసోం రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ అసోం కమలానికి గట్టి దెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన నందితా ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 2022 నుంచి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వంలో విద్యుత్, గనులు, గిరిజన సంస్కృతి వంటి కీలక శాఖల మంత్రిగా నందితా సేవలందించారు. అయితే ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న హాఫ్లాంగ్ సీటును బీజేపీ నిరాకరించింది. ఆమె స్థానంలో కొత్త అభ్యర్థి రూపాలి లాంగ్థాసాకు టికెట్ కేటాయించడంతో నందిత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన ఆత్మాభిమానం కోసం, నియోజకవర్గ ప్రజల కోసం పార్టీ మారుతున్నట్లు ఆమె పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ వ్యూహం…నిర్మల్ త్యాగం:
నందితా చేరికతో కాంగ్రెస్ తన సమీకరణలను వేగంగా మార్చేసింది. నిజానికి హాఫ్లాంగ్ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మల్ లాంగ్థాసా పేరును కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది. అయితే నందిత… పార్టీలోకి రావడంతో తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ‘గత ఐదేళ్లుగా డిమా హసావో గొంతుకగా ఉన్న నందిత, తన సిద్ధాంతాల కోసం నిలబడ్డారు’ అని కాంగ్రెస్ కొనియాడింది.
ఫలించని సీఎం మంతనాలు…
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా నందితా నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఆ భేటీలో ఏం జరిగిందనేది ఇరు పక్షాలూ బయటపెట్టలేదు. కానీ, సీఎం పర్యటన తర్వాతే ఆమె కాంగ్రెస్ కండువా కప్ప్పుకున్నారు. దీన్నిబట్టి చర్చలు, బుజ్జగింపులు ఫలించలేదని స్పష్టమవుతోంది. అసోంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9, 2026న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.

The post కమలం పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘నందితా’ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *