కంప్యూటర్ ప్రింట్‌లా చేతిరాత.. 70 వేల సర్టిఫికెట్లపై అక్షరాల ముద్ర వేసిన ఏయూ లైబ్రేరియన్..! B Yarraji Reddy handwriting secrets revealed at Andhra University. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆంధ్ర యూనివర్సిటీలో బి. యర్రాజీ రెడ్డి చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు, 70 వేల సర్టిఫికెట్లపై ఆయన రాత, విద్యార్థులకు ఉచితంగా దస్తూరి నేర్పిస్తూ భవిష్యత్తు మారుస్తున్నారు.

+

ఆయన

ఆయన చేతిరాతతో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు

పేపర్‌పై ఆయన అక్షరాలు కనిపిస్తే అది చేతిరాత అనిపించదు, కంప్యూటర్ ప్రింట్ తీసినట్టే ఉంటుంది. అక్షరాల్లో ఆ అందం, ఆ క్రమబద్ధత కనిపిస్తాయి. ఎంతోమంది విద్యార్థులకు చేతిరాత ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. రాత రాయడం నేర్చుకుంటే భవిష్యత్తు మారుతుంది అని చెబుతూ దస్తూరి నేర్పిస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ) లైబ్రేరియన్ బి. యర్రాజీ రెడ్డి.

విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే చదువు మాత్రమే కాదు, చేతిరాత కూడా కీలకపాత్ర పోషిస్తుందని ఆయన నమ్మకం. అందుకే ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా దస్తూరి నేర్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు మాధ్యమ పాఠశాల విద్యార్థుల చేతిరాతను మెరుగుపరచి మంచి ఫలితాలు సాధించేలా ప్రోత్సహించారు. కేవలం 15 రోజుల సాధనతోనే చేతిరాతలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆయన చెబుతున్నారు.

1996లో ఆంధ్ర యూనివర్సిటీలో రికార్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన యర్రాజీ రెడ్డి అప్పటికే అద్భుతమైన దస్తూరి సంపాదించుకున్నారు. మొదట యూనివర్సిటీకి సంబంధించిన హాజరు రికార్డులు రాస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన రాత చూసి ఆశ్చర్యపోయిన యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు ఇచ్చే అధికారిక సర్టిఫికెట్లపై పేర్లు రాయడానికి ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి 2014 వరకు యూనివర్సిటీకి చెందిన వివిధ సర్టిఫికెట్లపై ఆయన చేతిరాతే అక్షరాల ముద్రగా నిలిచింది.

ఇప్పటివరకు దాదాపు 70 వేల మంది విద్యార్థుల సర్టిఫికెట్లపై ఆయన పేర్లు రాశారు. ఇప్పటికీ పాత సర్టిఫికెట్లలో పేర్లు సరిదిద్దాల్సి వచ్చినప్పుడు యూనివర్సిటీ అధికారులు ఆయన్నే సంప్రదిస్తుంటారు. తన దస్తూరి నచ్చి అవకాశం ఇచ్చిన ఆంధ్ర యూనివర్సిటీ అధికారులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన వినయంగా చెబుతున్నారు.

ఇప్పటికీ ఎవరికైనా మంచి చేతిరాత నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే తన వద్దకు రావాలని, ఉచితంగా నేర్పిస్తానని యర్రాజీ రెడ్డి అంటున్నారు. క్రమం తప్పకుండా సాధన చేస్తే చేతిరాత మాత్రమే కాదు, విద్యార్థుల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయం. వేలాది సర్టిఫికెట్లపై అక్షరాల ముద్ర వేసిన ఆయన దస్తూరి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిపోయింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *