ఒక జిల్లాలో కనిపిస్తే మరో జిల్లాలో దాడి.. గోదావరి ప్రాంతాల్లో పెద్దపులి దోబూచులాట..! Tiger spotted in Godavari districts causing fear among residents. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

రంపచోడవరం, కాకినాడ జిల్లాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

+

కాకినాడ

కాకినాడ పోలవరం జిల్లాల మధ్య పెద్దపులి వరుస దాడులు

ఆరెండు జిల్లాల జంట సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఒక ప్రాంతానికి అధికారులు చేరుకుంటే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లి దాడులు చేయడం వల్ల పెద్దపులి అటవీశాఖ అధికారులను, ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల రంపచోడవరం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి గత రాత్రి కాకినాడ జిల్లాలోకి ప్రవేశించి ఒక గేదెపై దాడి చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ ఘటనతో అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు పెద్దపులిని పట్టుకునేందుకు ఆదివారం రాత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే అధికారులు అక్కడికి చేరుకునేలోపే పెద్దపులి మరొక ప్రాంతానికి వెళ్లిపోయి మరో జిల్లాలో కనిపించడం అధికారులకు సవాలుగా మారింది. ఒక చోట కనిపించి మరో చోట దాడి చేస్తూ పెద్దపులి దోబూచులాడుతుండటంతో అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం కొత్త విషయం కాదు. మూడు సంవత్సరాల క్రితం కూడా దాదాపు ఆరు నెలల పాటు ఆరు జిల్లాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. తాజాగా గత మూడు నెలలుగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం కొనసాగుతూ ఉండటంతో అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. గతంలో ఒకసారి పట్టుకుని వేరే ప్రాంతంలో వదిలినప్పటికీ మళ్లీ అదే ప్రాంతానికి రావడంతో అధికారులకు చిక్కుముడిగా మారింది.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లో దాడి చేసిన పెద్దపులి ప్రస్తుతం రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. సోమవారం ఒక గేదె దూడను కూడా పెద్దపులి చంపి ఆహారంగా తీసుకున్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో పెద్దపులిని మత్తు ఇంజక్షన్ ద్వారా బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డీఎఫ్ఓ సహా అధికారులు అక్కడే మకాం వేసి పెద్దపులి కదలికలపై నిఘా కొనసాగిస్తున్నారు. ఈ రాత్రి పెద్దపులి చిక్కుతుందా లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోతుందా అన్నది ఉత్కంఠగా మారింది.

ఇక రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా గేదెలు, ఆవులను అటవీ సమీప ప్రాంతాల్లో కట్టకుండా, రాత్రి సమయంలో ఇళ్ల సమీపంలో ఉంచాలని సూచించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *