ఒకపక్క హీట్‌వేవ్ అలర్ట్.. మరోపక్క పిడుగులతో వర్షాలు.. తెలుగు ప్రజలకు డబుల్ టెన్షన్..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్ లో మిశ్రమ వాతావరణం, ఐఎండీ విశాఖ కేంద్రం ప్రకారం పిడుగులతో వర్షాలు, అనేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

+

తెలుగు

తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ వాతావరణం.. కొన్నిచోట్ల ఎండలు కొన్నిచోట్ల వర్షాలు అంటు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు ఆకస్మికంగా కురిసే వర్షాలు ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం కొనసాగనున్నట్లు India Meteorological Department కు చెందిన విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

మంగళవారం, బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్రలో మాత్రం వడగాల్పులు తీవ్రంగా కొనసాగనున్నాయి. ముఖ్యంగా మన్యం ప్రాంతాల్లో ఎండ తీవ్రత మరింతగా పెరిగే అవకాశముందని హెచ్చరించారు.

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ (Prakhar Jain) తెలిపిన వివరాల ప్రకారం, విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు.

ఇక వడగాల్పుల ప్రభావం కూడా తీవ్రంగానే ఉండనుంది. మంగళవారం 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 13 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, కొమరాడ, కురుపాం, సీతానగరం మండలాలతో పాటు పోలవరం జిల్లా చింతూరు, కూనవరం ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు మండలాల్లో కూడా ఎండ తీవ్రత ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ఉంది.

బుధవారం కూడా పరిస్థితి పెద్దగా మారేలా కనిపించడం లేదు. మొత్తం 14 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల నమోదైన ఉష్ణోగ్రతలు కూడా పరిస్థితి తీవ్రతను చూపిస్తున్నాయి. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, ఖాజీపేటలో 42.5°C, కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.3°C, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు వాతావరణ మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలు, వర్షాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *