ఐపీఎస్ సునీల్‌కు చుక్కెదురు


విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ సోమవారంతో ముగియనుండగా… దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. అలాగే సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.
ఐదో రోజుకు చేరిన విచారణ
సునీల్‌నాయక్ విచారణ ఐదో రోజు కూడా కొనసాగింది. సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయనను పోలీసులు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఘటనపై సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం. అనంతరం ఆయనను సీఐడీ కార్యాలయం నుంచి గుంటూరు సీసీఎస్ స్టేషన్‌కు తరలించారు. విజయనగరం ఎస్పీ దామోదర్… సునీల్ నాయక్‌ను ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు 16న విచారణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసును సీబీఐకి బదలాయించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.ఈ కేసును ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేసే అధికారం లేదన్న పిటిషన్… ప్రజాప్రతినిధుల కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలంటూ వేసిన మరో పిటిషన్‌పైనా విచారణ జరిగింది. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టగా… ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. సీఎం చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ హాజరయ్యారు. ఈ కేసు విచారణలో తమకు ప్రాథమిక అభ్యంతరాలు ఉన్నాయని, విచారణ అర్హత మీద వాదనలు వినాలని న్యాయమూర్తిని సీనియర్ న్యాయవాది కోరారు. తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ముకుల్ రోహిత్గీ కోరారు. ఆయన అభ్యర్థన మేరకు 16వ తేదీన వాదనలు వింటామని, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అన్ని కేసులను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

The post ఐపీఎస్ సునీల్‌కు చుక్కెదురు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *