పొరపాటుగా ఇచ్చిన స్టేతో ఎంజాయ్ చేశారు… సరిచేస్తున్నాం
. ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందే
. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
. డిశ్చార్జి పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలైన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని (డిశ్చార్జ్) ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేయగా… దానిని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఆమెపై విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు దారులు తెరిచారని, దీనిలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. పదవిలో ఉన్నంతకాలం ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు… డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసింది. వేరే కేసుగా భావించి తొలుత స్టే ఇచ్చామని, ఇప్ప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం పేర్కొంది. పొరపాటుగా ఇచ్చిన స్టేతో నిందితులు ఇప్పటివరకు ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించింది. ఇకపై ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ స్పష్టం చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కర్నాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ సంస్థకు అనంతపురం జిల్లాలో మైనింగ్ లీజులు కేటాయించారు. కేటాయించిన సరిహద్దులు దాటి ఓఎంసీ సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని, అటవీ భూములను ఆక్రమించిందని ఆరోపణలు వచ్చాయి. సుమారు 8.5 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్లు సీబీఐ గుర్తించింది. ఆ సమయంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఓఎంసీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని సీబీఐ ఆమెను నిందితురాలిగా చేర్చింది. నిబంధనల ప్రకారం గనుల నుంచి తీసిన ఖనిజాన్ని సొంత పరిశ్రమలకే విని యోగించాలి. అటువంటి దానిని క్యాప్టివ్ మైనింగ్ అంటారు. కానీ శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డికి మేలు చేసేందుకు కావాలనే ఆ పదాన్ని జీవో నుంచి తొలగించి… ఖనిజాన్ని బయట అమ్ముకునేలా అక్రమా లకు దారులు తెరిచినట్లు కోర్టు దష్టికి సీబీఐ తెచ్చింది. 2011లో ఆమె ఈ కేసులో అరెస్టయి జైలుకు కూడా వెళ్లారు. పదేళ్లకు పైగా ఈ కేసు విచారణ దశలోనే ఉంది. తనపై ఉన్న ఆరోపణల్లో నిజం లేదని, విచారణ నుంచి తనను తప్పించాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా సుప్రీం తీర్పుతో బ్రేక్ పడింది.
The post ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు appeared first on Visalaandhra.


