Last Updated:
ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ మధ్య ఉద్రిక్తత, పోలీసులు భద్రతా చర్యలు, క్యాంపస్‌లో కట్టుదిట్టమైన నియంత్రణ.
ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమం చుట్టూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ మధ్య మాటల యుద్ధం వేడెక్కింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏయూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
యూనివర్శిటీ బాస్కెట్‌బాల్ మైదానం, పరిపాలనా భవనం పరిసరాల్లో ఎటువంటి అనుచిత ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. క్యాంపస్ అంతటా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మెయిన్ గేట్ వద్ద ప్రతి ఒక్కరిని ఐడీ కార్డులు చూపించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులు ఏయూ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఆర్ఎస్ఎస్ శాంతియుతంగా కవాతు నిర్వహిస్తుండగా ఎస్ఎఫ్ఐ నాయకులు వచ్చి దాడి చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వెంటనే స్పందించి ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్ఎస్ఎస్ శాఖ వద్దకు వచ్చి చర్చించకుండా దాడికి దిగడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
ధర్నా నేపథ్యంలో మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. బాస్కెట్‌బాల్ మైదానంలో ఏబీవీపీ విద్యార్థులు తమ కార్యక్రమాలను కొనసాగించారు.
యూనివర్శిటీ సెక్యూరిటీ డీన్ ఆచార్య ఇమ్మానియేల్ రాజు మాట్లాడుతూ, ఇతరులను వర్సిటీ లోపలికి రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఐడీ కార్డులు చూపిన విద్యార్థులకే అనుమతి ఇస్తున్నామని చెప్పారు. అలాగే వసతిగృహాల్లో నాన్ బోర్డర్లను బయటకు పంపించేందుకు రాత్రి వేళల్లో చీఫ్ వార్డెన్లు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
క్యాంపస్‌లో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉన్నప్పటికీ, విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుండడంతో యూనివర్శిటీ వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. పోలీసులు, యూనివర్శిటీ అధికారులు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh
Feb 20, 2026 10:53 PM IST


