ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట..


భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి.టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకే రిఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఁకొంతమంది దళారులు ముందుగానే పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసి, అమ్ముడుపోని వాటిని రైలు బయల్దేరడానికి కొద్దిసేపటి ముందు రద్దు చేసి రిఫండ్ పొందుతున్నారు. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరకడం లేదు. కొత్త నిబంధనలతో ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చుఁ అని ఆయన వివరించారు.

కొత్త నిబంధనలు ఇవే..
సవరించిన నిబంధనల ప్రకారం.. టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. రైలు బయల్దేరడానికి 72 గంటల కంటే ముందు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే, నామమాత్రపు క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి గరిష్ఠ‌ రిఫండ్ లభిస్తుంది.

72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే, టికెట్ ధరలో 25 శాతం కోత విధిస్తారు.
24 గంటల నుంచి 8 గంటల లోపు రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం కోత పడుతుంది.
ఇకపై రైలు బయల్దేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ ఇవ్వరు.

మరోవైపు ప్రయాణికులకు ఊరట కల్పిస్తూ బోర్డింగ్ స్టేషన్ మార్పు నిబంధనను సరళతరం చేశారు. కొత్త రూల్ ప్రకారం రైలు షెడ్యూల్ సమయానికి 30 నిమిషాల ముందు వరకు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. ప్రస్తుతం చార్ట్ సిద్ధం కాకముందు మాత్రమే ఈ మార్పునకు అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి బహుళ స్టేషన్లు ఉన్న నగరాల్లోని ప్రయాణికులకు ఈ కొత్త నిబంధన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *