ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు


ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ‌ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లో రాయచోటి కేంద్రంగా 3 లక్షల ఇళ్లను అందించిన ప్రభుత్వం, తాజాగా రెండో విడతలో 1 లక్ష టిడ్కో గృహాలతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తోంది. పుదూరులో జరిగే కార్యక్రమం అనంతరం సీఎం లబ్ధిదారులతో ముచ్చటించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

సూళ్లూరుపేట కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి బయలుదేరతారు. అక్కడ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమం తొలి వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొంటారు. రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
సీఎం చంద్రబాబు ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.50 గంటలకు పుదూరుకు చేరుకుంటారు. 11.55 గంటలకు లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. 12.40 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 02.40 గంటలకు సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 04.35 గంటలకు తిరుపతి చేరుకుంటారు. 04.45 గంటలకు శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిన ఆడిటోరియంలో నిర్వహించే పీ4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగించుకుని రాత్రి 08.50 గంటలకు అమరావతి చేరుకుంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *