న్యూదిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందిన కంటెంట్ కొత్త సవాళ్లు విసురుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశించింది. ఏఐ కంటెంట్‌ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి అప్లయ్ చేశాక లేబుల్‌ను గానీ, మెటా డేటాను గానీ తొలగించడానికి లేదా కనబడకుండా చేయడానికి వీల్లేకుండా ఉండాలని స్పష్టంచేసింది. చట్టవిరుద్ధమైన, అసభ్య, మోసపూరిత ఏఐ కంటెంట్‌ను నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఆటోమేటెడ్ సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది. ఏఐ కంటెంట్‌ను దుర్వినియోగం చేస్తే పడే పెనాల్టీలు, శిక్షల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి మూడునెలలకోసారి యూజర్‌కు సందేశాలు పంపించాలని సామాజిక మాధ్యమాలకు ఆదేశించింది. ఏఐ జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశించినప్ప్పుడు దాన్ని మూడు గంటల్లోనే తొలగించేలా సామాజిక మాధ్యమాలకు కేంద్రం గడువు విధించింది.


