-సీపీఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి
విశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి నగరంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏఐటీయూసీ మహాసభలు జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్యభ భవన్ లో మంగళవారం సీపీఐ కార్యవర్గ సభ్యులు , ఏఐటియుసి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పుట్టా హరినాథరెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో జరిగే మహాసభలకు సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరు అవుతారన్నారు. 26వ తేదీ ఇందిరామైదానంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలకు ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమరజిత్ కౌర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ముఖ్య అథిథులుగా హాజరవుతారన్నారు. ఈ మహాసభ చాలా ప్రాధాన్యతతో కూడకున్నదని హరినాథరెడ్డి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మహాసభలు జరుగుతున్నాయన్నారు. కార్మికవర్గం బ్రిటీషు సామ్రాజ్యవాదులతో కొట్లాడి సుమారు 60 చట్టాలను సాధించుకున్నారన్నారు. అయితే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి… వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందన్నారు. కార్మికవర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే కుట్రలో భాగంగానే మోదీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ లు తెచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్ లను రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థించడం బాధాకరమన్నారు. ఈ లేబర్ కోడ్ లతో కార్మికుల హక్కులు హరించుకు పోతాయని హరినాథరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం.. కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా పాలకులు పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. కార్మికులు ఎక్కువ గంటలు పని చేయాలని నేటి పాలకులు వింత వాదన చేస్తున్నారని… ఇందులో భాగంగానే 8గంటలకు బదులు 10గంటలు పని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిందన్నారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం 12గంటల పని దినాలు అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఇక ఉత్పత్తి వికేంద్రీకరణ చేయక పోవడం వలన ఆదాయం కేవలం కొన్ని సంపన్న కుటుంబాలకే చెందుతోందన్నారు. ఈ కారణంగానే పేదవాడు మరింత పేదగా మారిపోతున్నాడని పుట్టా హరినాథరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి అందరికీ సమానంగా పంచాలని.. లేబర్ కోడ్ లు రద్దు చేయాలని… అసంఘటిత కార్మికుల హక్కులు కాపాడాలనే ప్రధాన అజెండాతో ఈ ఏఐటీయూసీ మహాసభలు జరుగుతున్నాయన్నారు. ఈ మహాసబలకు కార్మికవర్గం తరలివచ్చి జయప్రదం చేయాలని పుట్టా హరినాధరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు.


