ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 404 ప్రభుత్వ కళాశాలలు, 221 ఎయిడెడ్ కాలేజీలు, 863 ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో పాటు 7 ఇతర విద్యా సంస్థలను సెంటర్లుగా ఎంపిక చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్ కాలేజీల్లో అధికంగా సెంటర్లు ఉండగా, మిగిలిన జిల్లాల్లో ఎక్కువగా ప్రభుత్వ కళాశాలలనే ప్రాధాన్యతలోకి తీసుకున్నారు. మాస్ కాపీయింగ్‌కు ఏమాత్రం అవకాశం లేకుండా దాదాపు 30 వేల సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించబోతున్నామని, ప్రతి సెంటర్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్వి కృష్ణాదిత్య తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని ఆయన సూచించారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని… కానీ, ఆ ఆందోళన వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని, అందుకే నిర్ణీత సమయానికి హాజరుకావాలని కోరారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను బయటకు పంపమని, పరీక్షా పత్రాలను కూడా అప్పటి వరకు బయటకు తీసుకెళ్లకూడదని చెప్పారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు లేదా మాల్ ప్రాక్టీస్ జరిగితే నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఇక హాల్ టికెట్ల విషయంలో తలెత్తిన వివాదాలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా, అందరికీ హాల్ టికెట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోర్టుకు వెళ్లిన విద్యార్థులకు కూడా ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28,500 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉంటారని, విద్యుత్, రవాణా, పోలీస్ శాఖల సమన్వయంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కృష్ణాదిత్య వెల్లడించారు.


