అలప్ప్పుళ: కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా ఎల్‌డీఎఫ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఎల్‌డీఎఫ్, బీజేపీలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ఎల్‌డీఎఫ్‌ను ఒక అదృశ్య హస్తం పథనిర్దేశం చేస్తోంది. ఆ అదృశ్య హస్తానిది భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మతత్వం. ప్రజల్ని విభజించి విద్వేషాలను రెచ్చగొట్టడం దాని నైజం’ అని రాహుల్ పరోక్షంగా ఎల్‌డీఎఫ్, బీజేపీల మధ్య అనుబంధం ఉందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రదేశాల్లో మైనారిటీలపై దాడులకు పాల్పడే శక్తులతో కేరళ ముఖ్యమంత్రి, ఎల్‌డీఎఫ్ నేత పినరయి విజయన్‌కు సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీ, ఎల్‌డీఎఫ్‌ల మధ్య రహస్య ఒడంబడిక ఉందని పునరుద్ఘాటిస్తూ, ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో శబరిమల బంగారు తాపడం వివాదాన్ని ప్రస్తావించడం లేదని ఎత్తి చూపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేరళలోని అలప్ప్పుళ, కట్టప్పనా, కొచ్చిన్‌లలో శనివారం జరిగిన ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎల్‌డీఎఫ్‌లో ఎవరూ మిగిలి ఉండరని జోశ్యం చెప్పారు. ఎల్‌డీఎఫ్ తీరులో ఏదో మార్పు జరగడం వల్లే సీపీఎం మాజీ నేత జి.సుధాకరన్ మాతో కలిసి ఈ వేదికపై నిలుచున్నారని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్, సీపీఎంల మధ్య ఉన్న సంబంధం కేరళలోని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. తనపై, కాంగ్రెస్‌పై నిరంతరం మాటల దాడి చేసే మోదీ…అవినీతికి పాల్పడిన ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి, పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తన పిల్లలను కాపాడుకోడానికే విజయన్ మోదీకి భయపడుతున్నారని ఆరోపించారు.
The post ఎల్‌డీఎఫ్‌ను అదశ్య హస్తం నిర్ధేశిస్తోంది: రాహుల్ గాంధీ appeared first on Visalaandhra.


