. అర్హులను అనర్హులుగా ప్రకటించిన అధికారులు
. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని పాలకులు
. పోలవరం నిర్వాసితుల ఆక్రందనలు
విశాలాంధ్ర-కుక్కునూరు:అవి రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు… కూలి పనులు చేసుకొని కడుపు నింపుకునే సాధారణమైన జీవితాలు. సాగునే ఉపాధిగా నమ్ముకొని కుటుంబాలను నెట్టుకొస్తున్న ఏజెన్సీ బిడ్డలు… పచ్చని ప్రకృతిలో అభయారణ్యం మధ్య జీవిస్తున్న కర్షకులు… వారంతా ఓ బహుళార్థసాధక ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి ఆస్తులు, భూములు కోల్పోయి చరిత్రపుటల్లో నిలిచిన త్యాగధనులు… ప్రాజెక్టు నిర్మాణం కోసం కట్టుకున్న గూడు సైతం కాదనకుండా వదిలిపెట్టిన వారి త్యాగాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఒకటైన కుక్కునూరు మండలం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ఆది నుంచి అనేక సిత్రాలు, విచిత్రాలు చోటుచేసుకున్నాయి. భూముల పరిహారం పంపిణీలో అనర్హులకు పరిహారం అందిన దాఖలాలు అనేకం బయటికి వచ్చాయి. అయితే వ్యక్తిగత, ఇళ్ల పరిహారం చెల్లింపులో అర్హులను గుర్తించడంలో అధికారులు చేసిన నిర్లక్ష్యం బాధితులకు శాపమైంది. దీంతో న్యాయం కోసం కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా నిర్వాసితులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా వారి పట్ల ఏ ఒక్కరికీ ఆవగింజంత దయ కూడా లేకపోవడం శోచనీయం. 41.15 కాంటూరు పరిధిలో ముంపుకు గురవుతున్న కుక్కునూరు మండలం నిర్వాసితులకు 2016, 2017లో ఆరఅండఆర్ ప్యాకేజీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కొన్ని నెలల క్రితం నుంచి నిర్వాసితుల ఖాతాల్లో ఇళ్ల, వ్యక్తిగత పరిహారం డబ్బులు జమవుతున్నాయి. కాగా అప్పట్లోనే కొందరి నిర్వాసితుల వివరాలు ఎసఈఎస్ డేటాలో ఎంట్రీ కాకపోవడం, అర్హులను అనర్హులుగా ప్రకటించడంతో ఏళ్ల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ తమ గోడు వెల్లబుచ్చుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సాగునీటి ప్రాజెక్టులు వస్తే అందరికీ మేలు జరుగుతుందని, తాము సర్వం కోల్పోయినా సమాజం అభివృద్ధి చెందుతుందని పోలవరం నిర్వాసితులు తమ భూములను, ఇళ్లను కోల్పోయేందుకు సిద్ధపడ్డారు. అంత పెద్దమనసుతో నిర్వాసితులు ఆలోచిస్తే ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా వారి త్యాగాన్ని పరిహాసం చేస్తోంది. తొమ్మిదేళ్లుగా అర్హులైన నిర్వాసితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వేడుకుంటున్నా అధికారులకు దయ కలగడం లేదు. నిర్వాసితుల జాబితా విషయంలో క్షేత్రస్థాయిలో అధికారుల తప్పిదాలు శాపంగా మారడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. ఎసఈఎస్ డేటా నమోదు సమయంలో చాలామంది అర్హులను అధికారులు పక్కన పెట్టడం వల్లే తమకు పరిహారం అందడం లేదని వాపోతున్నారు. సర్వే సమయంలో అధికార యంత్రాంగం తమను అర్హులుగా పరిగణించకపోవడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని అంటున్నారు. జాతీయ హోదా పొందిన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయాలనే తలంపుతో ఉంది. కానీ అర్హులైన నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో పట్టనట్టు ఉండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలని, తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
న్యాయం చేయండి : అమరవరపు ఆదిమ్మ
పూర్వీకుల నుంచి కుక్కునూరు ఏ బ్లాక్‌లో నివశిస్తున్నాం .ఏ ఒక్క రోజు కూడా ఊరు వదిలి వెళ్లలేదు. సర్వే సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నా వివరాలు ఎసఈఎస్ డేటాలో లేకపోవడం వలన పరిహారం నిలిపివేశారు. ఎన్నోసార్లు అధికారుల ఎదుట మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదు. ఇప్పటికైనా అధికారులు కనికరించి నాకు న్యాయం చేసి పరిహారం మంజూరు చేయాలని వేడుకుంటున్నా.
పరిహారం ఇప్పించండి: నకిరికంటి సుబ్బయ్య
నేను చేతి వృత్తి చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నాను. భార్య, పిల్లలతో స్థానికంగా ఉన్నా అధికారులు నన్ను అనర్హుడిగా ప్రకటించారు. అధికారులు చేసిన తప్పిదం నాకు శాపంగా మారింది. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయాను. చేతిలో చిల్లిగవ్వ లేక కార్యాలయాల చుట్టూ తిరగలేక పోతున్నాను. పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాను. అధికారులు విచారణ చేసి పరిహారం ఇవ్వాలని కోరుతున్నాను.
The post ఎదురుచూపులు appeared first on Visalaandhra.


