Last Updated:
మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా ఉంటే, మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే మండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారుతూ ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితులకు సంవాహన వర్షాలు, ద్రోణి ప్రభావమే కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
భారత వాతావరణ శాఖ విశాఖ కేంద్రానికి చెందిన అధికారి జగన్నాథ కుమార్ ప్రకారం, వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం కొనసాగనున్నట్లు తెలిపారు. ఉదయం వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ వర్షాలు రెండు నుంచి మూడు గంటల పాటు మాత్రమే పరిమితమయ్యే అవకాశముందని తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా గట్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ వాతావరణ మార్పులు మరింత స్పష్టంగా కనిపించనున్నాయి.
ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ మార్పులు వ్యవసాయం, రవాణా, సాధారణ జీవన విధానంపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు. ఇక తీర ప్రాంతాల్లో గాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండనుంది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సముద్రానికి వెళ్లే మత్స్యకారులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మొత్తం మూడు రోజుల పాటు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలు, వర్షాలు మారుమూలగా ఉండే ఈ వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కరోజులోనే రెండు విభిన్న ఋతువుల అనుభూతిని ఇస్తున్న ఈ వాతావరణం రాష్ట్ర ప్రజలకు కొత్త అనుభవంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



