Last Updated:
ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలం దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. విశేష అర్చనలు, పచ్చడి నివేదన, పంచాంగ పఠనం, కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి.
శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది. తెల్లవారుజామున నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడగా, శ్రీస్వామివారికి విశేష అర్చనలు, ఉగాది పచ్చడి నివేదన, మంగళాశాసనాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సమర్పించిన ఉగాది పచ్చడిని భక్తులకు పంచడం విశేషంగా నిలిచింది.
ఉదయం వేళ స్వామివారి సన్నిధిలో ఆరాధన కార్యక్రమాలు భక్తులను భక్తిరసంలో ముంచెత్తాయి. అనంతరం రాజభోగం, ఆలయ ప్రధాన అర్చకులచే ఆస్థాన మండపంలో పంచాంగ పఠనం జరిగింది. తెల్లవారుజామున నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం కార్యక్రమాలు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో తేలిపోయారు. దర్శనాల అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను పంపిణీ చేసి భక్తులకు సేవలు అందించారు.
ఇక చిన్నారుల కోసం నిర్వహించిన అక్షరాభ్యాసం కార్యక్రమం ఉగాది వేడుకలకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చారు. సింహాచలం స్వామివారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే మంచి విద్యాభివృద్ధి కలుగుతుందనే విశ్వాసంతో అనేక మంది పాల్గొని, పిల్లలకు వర్ణమాల బోధించారు. ఆలయ ప్రాంగణం మొత్తం చిన్నారుల కిలకిలారావాలతో కళకళలాడింది.
మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు జరిగిన వార్షిక కళ్యాణ మహోత్సవాల భాగంగా పందిరి రాట ఉడుపు ఉత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా పండితులకు సత్కారాలు, విశిష్ట సేవా పురస్కారాలు అందజేస్తారు. అనంతరం జరిగిన తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉగాది సందర్భంగా సాయంత్రం వేళ సూర్యకిరణాలు స్వామివారి సన్నిధిని తాకడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. సింహాచలం గ్రామస్తులు, భక్తులు కలిసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా, ఆలయం మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోనుంది.
రాత్రి వేళ కొండపై సాంస్కృతిక కార్యక్రమాలు కనులవిందుగా సాగనున్నాయి, ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలను వీక్షించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. మొత్తం మీద ఉగాది వేళ సింహాచలం ఆధ్యాత్మిక వైభవంతో నిండిపోయి, భక్తుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచేలా సంబరాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


