Last Updated:
ఉగాది సందర్భంగా గోదావరి జిల్లాల్లో నూకాలమ్మ తల్లి జాతరలు భక్తి, సంప్రదాయాల కలయికగా జరుగుతున్నాయి. ఇసుకలపేటలో జరిగిన జాతరలో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుకుంది. చిలకల జాతర ప్రత్యేక ఆకర్షణ.
ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతటా గ్రామదేవతల పండుగలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే గోదావరి జిల్లాల్లో జరిగే నూకాలమ్మ తల్లి జాతరలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నాయి. గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే అమ్మవారికి ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య, ఉగాది సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాలు భక్తి, సంప్రదాయాల కలయికగా నిలుస్తున్నాయి. ఈ వేళ అమ్మవారి ఆలయాలు, రహదారులు తీర్థ శోభతో ప్రకాశిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ఈ జాతరలు జరుగుతుండగా, ముఖ్యంగా తుని పాతబజార్ నుంచి ఇసుకలపేట వరకు జరిగే ఉత్సవాలు విశేషంగా నిలుస్తాయి. నిలువెత్తు రూపంలో కటాక్షించే నూకాలమ్మ తల్లి దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరుతున్నారు. ఒకవైపు తీర్థ జాతర, మరోవైపు అమ్మవారి దర్శనం.. ఈ రెండూ కలసి భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తుతున్నాయి.
సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా తమ స్వగ్రామాలకు చేరుకుని ఈ జాతరలో పాల్గొనడం ఈ ఉత్సవానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ ఏడాది ఇసుకలపేటలో జరిగిన జాతరలో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుకుంది. “ఇసుక వేస్తే రాలనంత జనసందోహం” అన్నట్టుగా వేలాది మంది అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థించారు.
ఈ జాతరలో అత్యంత ప్రత్యేకమైన అంశం “చిలకల జాతర”. జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరూ చిలక కొనడం ఒక ఆనవాయితీగా మారింది. అయితే ఇవి ఎగిరే చిలకలు కాకుండా తినే చిలకలు. రంగురంగుల ఆకృతుల్లో, విభిన్న సైజుల్లో తయారైన ఈ తీపి చిలకలు ఆలయం బయట భక్తులను ఆకట్టుకుంటూ కనిపిస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఈ చిలకలు ఆకర్షిస్తాయి.
అమ్మవారి దర్శనం అనంతరం ఈ చిలకను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తే, ఆ తీపి మాదిరిగానే జీవితమంతా సుఖసంతోషాలతో నిండిపోతుందని భక్తుల గాఢ నమ్మకం. అందుకే ఈ జాతరను “చిలకల తీర్థం” అని కూడా పిలుస్తారు. ఈసారి కూడా భక్తుల అభిరుచులకు తగ్గట్టు అనేక రకాల మోడల్స్ చిలకలు జాతరలో సందడి చేశాయి. మొత్తంగా నూకాలమ్మ తల్లి జాతర భక్తి, ఆనందం, సంప్రదాయం ఇలా అన్నీ కలిసిన ఒక మహోత్సవంగా నిలుస్తోంది. ఊరూవాడా ఏకమై పెద్దఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివచ్చి, కుటుంబాల సమేతంగా ఆలయానికి చేరుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు. ఉగాది వేళ గోదావరి నేలపై జరిగే ఈ జాతరలు భక్తి వైభవాన్ని మరింతగా ప్రతిబింబిస్తూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


