Last Updated:
డాక్టర్ శ్రీనివాసులు క్షయ వ్యాధి లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తూ, గంగవరం పిహెచ్సీలో ర్యాలీ నిర్వహించి ఉచిత పరీక్షలు చికిత్సలపై అవగాహన కల్పించారు.
శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెండు వారాలకు మించి తగ్గని దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఆకలి మందగించడం, వేగంగా బరువు తగ్గడం, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం, దగ్గినప్పుడు కళ్లెలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటే అవి క్షయ వ్యాధి సంకేతాలు కావొచ్చని డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. అయితే ఈ వ్యాధి సోకినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో గుర్తిస్తే పూర్తిగా నయం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం గంగవరం మండల ప్రభుత్వ పిహెచ్సీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం చేపట్టి ప్రజలకు క్షయ వ్యాధి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ వ్యాధి ఒక అంటువ్యాధి అని, ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు.
ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అయితే శరీరంలోని ఇతర భాగాలైన చర్మం, మెదడు వంటి ప్రాంతాలకూ వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. క్షయ వ్యాధి బారినపడిన వ్యక్తి దగ్గు లేదా తుమ్ము ద్వారా గాలిలోకి వెళ్లే సూక్ష్మ చుక్కల ద్వారా ఇతరులకు సులభంగా వ్యాపిస్తుందని హెచ్చరించారు. అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు, చికిత్స అందిస్తోంది. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో బల్గం పరీక్ష, ఎక్స్-రే, CBNAAT వంటి ఆధునిక పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారికి పూర్తిస్థాయిలో కోర్సు పూర్తయ్యే వరకు ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పిహెచ్సీ వైద్య సిబ్బందితో పాటు సాయి శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా గ్రామస్తులకు క్షయ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్సపై అవగాహన కల్పించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచించారు.
మొత్తంగా క్షయ వ్యాధి ప్రాణాంతకం కాదని, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి చిన్న లక్షణాలను కూడా పట్టించుకుని వెంటనే పరీక్షలు చేయించుకుంటే, పూర్తిగా నయం కావడం సాధ్యమని స్పష్టం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh


