ఈపీఎఫ్ కనీసపింఛను పెంచాలి


కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన

న్యూదిల్లీ: ఈపీఎఫ్ చందాదారులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్ట్స్‌టైల్స్, స్కిల్‌డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్ప్పుడు అందుతున్న మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని, దాన్ని రూ.7,500కు పెంచాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో ఇటీవల దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించారు. దీనిపై పార్లమెంటరీ స్థాయీసంఘం స్పందించింది. కనీస పెన్షన్‌పై ఇప్పటికే పెన్షనర్ల నుంచి పలు విజ్ఞాపనలు వచ్చినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కనీస మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. అందువల్ల ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995ని పునఃసమీక్షించి పెన్షన్ మొత్తం పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కేటాయింపులు చేయాలని సూచించింది. దీనితో పాటు అనేక ప్రతిపాదనలు చేసింది. లేబర్ కోడ్‌ల అమలును కమిటీ స్వాగతించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో శాశ్వత సమన్వయ, సంప్రదింపుల(పర్మినెంట్ కో-ఆర్డినేషన్, ఇంటరాక్షన్) బోర్డు నెలకొల్పాలని ప్రతిపాదించింది. ప్రభుత్వం అందించే వివిధ పథకాల అమలు తీరుతెన్నులను ఈ బోర్డు పరిశీలిస్తుందని పేర్కొంది. పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే రెగ్యులర్ వర్కర్ల మాదిరిగా పనిచేసే కాంట్రాక్టు వర్కర్లకు మాత్రం పరిహారం అందడంలో జాప్యం జరుగుతోందని, వారికి సత్వరమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతిపాదించింది. అలాగే, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద సామాజిక భద్రత ప్రయోజనాలను మరింత మందికి విస్తరించేందుకు ప్రస్తుతం ఉన్న వేతన పరిమితిని తక్షణమే సవరించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం రూ.21 వేల వరకు వేతనం పొందుతున్న వారికి మాత్రమే ఈఎసఐ ప్రయోజనాలు అందుతున్నాయి.

The post ఈపీఎఫ్ కనీసపింఛను పెంచాలి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *