తెహ్రాన్ : అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులకు సతమతమవుతున్న ఇరాన్ వాసులకు మరో దెబ్బ తగిలింది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు… ఆమ్ల వర్షం రూపంలో ప్రకృతి మరో దెబ్బతీసింది. వైమానిక దాడులతో ఇరాన్ వాసులు ఇప్పటికే భయాందోళనలు చెందుతున్నారు. అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ వర్షం కారణంగా ఇరాన్ వాసులు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఆకాశంలో పొగ, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు వర్షపు చినుకులు కిందకు పడుతూ పొగ, ఆయిల్ కణాలను కాలుష్యాన్ని కూడా తీసుకువస్తాయి అందుకే ఆ వర్షం నల్లగా కనిపిస్తుంది. ఈ వర్షం కారణంగా తలనొప్పి, శ్వాస సమస్యలు వస్తున్నాయని… భవనాలు, వాహనాలపై కలుషిత జలాలు పేరుకుపోతున్నాయని ఇరాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ ఆమ్ల వర్షం కన్నా ఇది హానికరమని వాతావరణ కాలుష్యంపై పరిశోధన జరుపుతున్న రెడ్ రీసెంట్ సొసైటీ తెలిపింది.


