టెలఅవీవ్: నెలరోజుల క్రితం ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్‌పైకి దూసుకెళ్లాయని ఇజ్రాయిల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. ఈ ఫైటర్‌జెట్లు 16వేలకు పైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది. ఇరాన్ ప్రముఖ నాయకులు, మిలిటరీ కమాండర్లు, హెడ్‌క్వార్టర్లు, అణు స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. యుద్ధం మొదలైన నాటినుంచి 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేశాం… దాదాపు 16వేల బాంబులను జారవిడిచాం…ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన 2వేల మందికి పైగా సైనికులు, కమాండర్లు హతమయ్యారని ఐడీఎఫ్ పేర్కొంది. కేవలం 40 సెకన్లలోనే 40 మందికి పైగా సీనియర్ అధికారులను అంతమొందించామని … మరో 5వేల కొత్త టార్గెట్లను కూడా గుర్తించినట్లు తెలిపింది. ఇరాన్, దాని అనుబంధ గ్రూప్‌లు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాయని, వాటిని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఐడీఎఫ్ పునరుద్ఘాటించింది. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా యుద్ధంపై స్పందించింది. ఇరాన్‌లోని భూగర్భ లక్ష్యాలను కూడా ఛేదించినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది.


