. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
. ఇరాన్ కొత్త నాయకత్వంపై స్పందించేందుకు నిరాకరణ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ముగింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యలను ఎప్పుడు నిలిపివేయాలన్న నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా తనదే అయినప్పటికీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో చర్చించి పరస్పర అవగాహనతో తుది నిర్ణయం తీసుకుంటా మని స్పష్టం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రా యిల్ పత్రికకు ఇచ్చిన టెలిఫోన్ ఇంట ర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గతంలో ఇజ్రాయిల్‌ను పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. అలాంటి పరిస్థితిని అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయిల్ కలిసి చర్యలు చేపట్టాయని చెప్పారు. “ఇరాన్ ఇజ్రాయిల్‌ను మాత్రమే కాదు, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలను కూడా నాశనం చేయాలని ప్రయత్నించింది. అయితే మేము కలిసి పనిచేసి ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్నాం” అని ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా, ఇరాన్‌తో యుద్ధం నాలుగు నుంచి ఆరు వారాల వరకు కొనసాగవచ్చని వైట్ హౌస్ వర్గాలు సూచించినప్పటికీ ట్రంప్ మాత్రం నిర్దిష్ట గడువు చెప్పేందుకు నిరాకరించారు. యుద్ధం పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన సంయుక్త సైనిక చర్యల తర్వాత ఇరాన్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ చర్యల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామేనీ మరణించారు. అనంతరం ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికైనట్లు తెహ్రాన్ ప్రకటించింది. ఈ నియామకంపై ట్రంప్ స్పందించేందుకు ట్రంప్ ఆసక్తి చూపలేదు. “ఏం జరుగుతుందో చూద్దాం” అని మాత్రమే వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన హెచ్చరికలను కూడా ఆయన గుర్తు చేశారు. కొత్త ఇరాన్ నాయకత్వం వైట్ హౌస్ మద్దతు లేకుండా ఎక్కువకాలం నిలబడలేదని గతంలో పేర్కొన్నట్టు సమాచారం. ఇరాన్ యుద్ధంపై వ్యాఖ్యానించడమే కాకుండా ట్రంప్ ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలపై కూడా స్పందించారు. ప్రస్తుతం అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ప్రధాని నెత న్యాహూకు క్షమాభిక్ష ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ వెంటనే క్షమాభిక్ష ఇవ్వాలని సూచించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ అధ్యక్ష కార్యాలయం స్పందిం చింది. ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశమని, అక్కడ న్యాయపాలన అమల్లో ఉందని తెలిపింది. క్షమాభిక్షకు సంబంధించిన అంశం న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా పరిశీలనలో ఉందని వెల్లడించింది.


