బాగ్దాద్: అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అతడికి ఇరాన్‌కు సమీపంగా ఉన్న కతైబ్ హెజ్‌బొల్లా మిలిషియా గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తమవుతోంది.
ఘటనపై ఎలీసా లీస్ మునోజ్
తీవ్ర ఆందోళన
ఇదే సమయంలో, ఈ ఘటనను ధ్రువీకరిస్తూ ఖతార్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరా వీడియోను విడుదల చేయడం మరింత సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ మహిళా మీడియా ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎలీసా లీస్ మునోజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షెల్లీ కిటెల్సన్ ఎంతో ధైర్యవంతురాలైన జర్నలిస్ట్ అని, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆమె వార్తలు కవర్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరగడం బాధాకరమని అన్నారు. బాగ్దాద్ వీధుల్లో ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.


