అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా బాంబులు…
తెహ్రాన్: ఇజ్రాయిల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయిల్‌కు అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా దాడులు జరిగాయి. అణు పరిశోధన కేంద్రం సమీపంలోని భవనాలపై క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్‌లోని కీలకమైన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్‌పై శనివారం దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే తాజాగా తెహ్రాన్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు రాగా… వాటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అరాద్, డిమోనా నగరాల్లోని నివాస ప్రాంతాలపై క్షిపణులు పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా… భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అరాద్‌లో జరిగిన దాడిలో దాదాపు 88 మంది గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. దెబ్బతిన్న భవనాల నుంచి దాదాపు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో పలువురు మరణించి ఉండవచ్చని ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది. అయితే, అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. భవన శిథిలాల కింద కొందరు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇక, ఇజ్రాయిల్‌కు కీలకమైన అణుపరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా నగరంలోని ఒక భవనంపై క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. అరాద్ నగరంపైకి వచ్చిన క్షిపణిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమవడంపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ తాజా దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు.
జెరూసలెంను తాకిన క్షిపణులు…
ఇరాన్ క్షిపణి ఇజ్రాయిల్‌లోని జెరూసలెంను తాకింది. పాత నగరంలోని అల్ అక్సా మసీదుకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రంజాన్ పర్వదినం వేళ మసీదులో ప్రార్థనలు చేసేందుకు ఎవరినీ అనుమతించలేదు. దీంతో వందలాది మంది ముస్లింలు గేట్ల బయటే ప్రార్థనలు చేశారు. ఇక్కడ ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.


