. ఇంధన క్షేత్రాలపై దాడులు ముమ్మరం
. ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం
. ఇరుగు`పొరుగు ఆగ్రహం
తెహ్రాన్: ఇజ్రాయిల్అమెరికా కలిసి ఇరాన్‌లో విధ్వంసం సష్టిస్తుండగా, ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ సైతం తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ యుద్ధం ఇప్ప్పుడు చమురు యుద్ధంగా మారిపోయింది. తమ దేశంలో చమురుగ్యాస్ క్షేత్రాలపై దాడులు జరపడంతో గల్ఫ్‌దేశాల చమురు నిల్వలపై ఇరాన్ గురి పెట్టింది. వైమానిక దాడులు చేసింది. యూఏఈ, ఖతార్‌లోని చమురు కేంద్రాలపై క్షిపణులు ప్రయోగించింది. సౌదీ అరాంకో సంస్థకు చెందిన రిఫైనరీలపై దాడి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలఎన్‌జీ (లిక్విఫైడ్ రిఫైనరీ గ్యాస్) రిఫైనరీ ప్లాంట్ అయిన రస్ లఫ్ఫాన్ (ఖతార్)పై ఇరాన్ దాడి చేసింది. దీంతో అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. కువైట్‌లోని మినా అల్ అహ్మదీ రిఫైనరీపైనా డ్రోన్ల దాడి చేసింది. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద రిఫైనరీ. కాగా, దాడుల భయంతో హబ్‌షన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఫీల్డ్‌లో కార్యకలాపాలను నిలిపివేసినట్లు అబు దాబీ అధికారులు వెల్లడించారు. ఇరాన్ యుద్ధాన్ని ఉధతం చేస్తున్నదన్నారు. తాజా పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలకు దారితీస్తున్నట్లు పరిశీలకులు అంటున్నారు. ఇరాన్ గ్యాస్`చమురు క్షేత్రాలపై ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ మేరకు దాడులను తీవ్రతరం చేసింది. ఒకవైపు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణ ఆంక్షలు ఉండటంతో చమురు రవాణా స్తంభించింది. మరోవైపు గల్ఫ్‌లోని చమురు కేంద్రాలపై దాడులతో పరిస్థితి మరింత జఠిలమైంది. గ్యాస్ ఉత్పత్తి తగ్గి సంక్షోభానికి దారితీస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 110 డాలర్లకు చేరింది. గల్ప్‌లోని చమురుÛ కేంద్రాలపై దాడులతో చమురు ఉత్పత్తి నిలిచిపోతే… సరఫరాకు ఇబ్బంది కలుగుతుంది.
ఖతార్ అల్టిమేటం
ఇరాన్‌కు చెందిన సైనిక, భద్రతా అటాచీలను ‘పర్సోనా నాన్ గ్రాటా’ (అవాంఛనీయ వ్యక్తులు)గా ఖతార్ ప్రకటించింది. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు ఖతార్ విదేశాంగ శాఖ అల్టిమేటం జారీ చేసింది. ఖతార్ లక్ష్యంగా ఇరాన్ దాడులను ఖండించింది. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను ఉల్లంఘనకు ఇరాన్ పాల్పడుతోందని, అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను అతిక్రమిస్తోందని దుయ్యబట్టింది. ఇదే క్రమంలో ఇరాన్ రాయబార కార్యాలయానికి అధికారిక లేఖ పంపింది. సంబంధిత అటాచీలకు, వారి సిబ్బందికి ఖతార్‌లో స్థానంలేదని తేల్చి చెప్పింది. ఇరాన్‌కు గట్టి బుదలిస్తామని హెచ్చరించింది.
తమ జాతీయ ప్రయోజనాలను, భద్రతను కాపాడుకోవడానికి కఠిన చర్యలకు వెనుకాడబోమని, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి తగిన రీతిలో ప్రతిస్పందించే హక్కు తమకుందని ఖతార్ వెల్లడించింది.
అవసరమైతే సైనిక చర్యలు: సౌదీ
అవసరమైతే ఇరాన్‌పై సైనిక చర్యను తీసుకొనే హక్కు తమకు ఉందని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ స్పష్టంచేశారు. తమ దేశంపైకి ప్రయోగించిన ఎనిమిది బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు తెలిపింది.
ఒమన్ తీరంలో నౌకపై దాడి
యూఏఈ సమీపంలో నౌకపై దాడి జరిగింది. ఈ విషయాన్ని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ గురువారం తెల్లవారుజామున వెల్లడించింది. ఒమన్ తీరంలోని ఖోర్ ఫక్కాన్‌కు 11 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగినట్లు తెలిపింది. యుద్ధం మొదలైన నాటినుంచి 20కి పైగా నౌకలు, ట్యాంకర్లపై దాడులు జరిగాయి.
సమీప భవిష్యత్‌లో ‘హోర్ముజ’ ట్యాక్స్!
హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నౌకల నుంచి టోల్ వసూలు చేసే యోచనలో ఇరాన్ ఉన్నది. ఈ మేరకు ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు ఇరాన్ చట్టసభ సభ్యుడు ఒకరు వెల్లడించారు. నౌకాయానం, ఇంధన రవాణా, ఆహార సరఫరా కోసం ఈ జల సంధిని వినియోగించే దేశాలు ఇకపై ఇరాన్‌కు టోల్, ట్యాక్స్ కట్టేలా బిల్లు తేవాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన తర్వాత హోర్ముజ్ కొత్త విధివిధానాలు వస్తాయని, ఆంక్షలు విధించిన దేశాలపై అలాంటి చర్యలే తీసుకునేలా నిర్ణయాలు ఉంటాయని ఇరాన్ ఇప్పటికే వెల్లడించింది.
పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని పేల్చేస్తాం: ట్రంప్
అమాయకపు ఖతార్‌పై ఇరాన్ తెలివి తక్కువగా దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇది కొనసాగితే ఇజ్రాయెల్ సాయం ఉన్నా, లేకపోయినాగానీ ఇరాన్‌పై మునుపెన్నడూ జరిగని స్థాయి దాడి చేస్తామని హెచ్చరించారు. పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని బెదిరించారు. అయితే ఆ స్థాయి హింస, వినాశనాన్ని కోరుకోవడం లేదని, ఖతార్ ఎలఎన్‌జీపై మళ్లీ దాడి జరిగితే సహించబోనని ఇరాన్‌కు ట్రంప్ స్పష్టంచేశారు.
అమెరికా మంత్రుల నివాసాలపైకి డ్రోన్లు
అమెరికా కీలక నేతల నివాసాలపై డ్రోన్‌ల సంచారం కలకలం రేపింది. విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఇంటి పరిసరాల్లో డ్రోన్లను చూసి నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్ ఫోర్స్ బేస్ వంటి అత్యంత కీలకమైన సైనిక స్థావరాల వద్ద కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు 20 డ్రోన్‌లు గుంపులుగా ఏర్పడి, తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రోన్‌లను ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనేది అంతుచిక్క లేదు. ఇవి సాధారణ వాణిజ్య డ్రోన్ల కంటే చాలా వేగంగా ప్రయాణిస్తుండటంతో వాటిని అడ్డుకోవడం సవాలుగా మారింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగరేషన్ (ఎఫ్‌బీఐ), పెంటగాన్ దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. కీలక నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు ఇరాన్ లేదా ఇతర విదేశీ శక్తులు ఈ డ్రోన్లT ప్రయోగిస్తున్నాయా? లేదంటే భవిష్యత్తులో ఏదైనా దాడికి సంబంధించిన సన్నాహక చర్యనా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
వ్యూహం మార్చిన అమెరికా
యుద్ధానికి డెడ్‌లైన్లు ఉండవని పెంటగాన్ వ్యాఖ్యానించింది. గతంలో జరగని స్థాయిలో దాడులను ఇరాన్‌ను దెబ్బతీయనున్నట్లు ప్రకటించింది. సౌదీ అరాంకోపై ఇరాన్ దాడి అమెరికాకు కోపం తెప్పించింది. ఇందుకోసం ఆ దేశం తీవ్ర పరిణమాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. గల్ఫ్ యుద్ధాన్ని తమదైన శైలిలో ముగిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై దాడులకు అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంది.గ్యాస్ కేంద్రాలపై గురి పెట్టింది. సౌదీ అరాంకోపై ఇరాన్ మెరుపు దాడులతో కంగుతిన్న అమెరికా ఆ దేశంపై విరుచుకుపడింది. ‘చనిపోయిన వారిని గౌరవిస్తాం, అనుకున్న పనిని పూర్తి చేస్తాం, మా పంధాలో యుద్ధాన్ని ముగిస్తాం’ అని ప్రకటించుకుంది. యుద్ధం ఆరంభం నుంచి ఇప్పటివరకు ఇరాన్ విషయంలో తమ విధానంపంధా మారలేదని చెప్ప్పుకొచ్చింది. ఇరాన్ కొత్త బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే సామర్థ్యాన్ని కోల్పోయిందని, ఆ దేశ క్షిపణిరక్షణ కేంద్రాలను నాశనం చేశామని వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన 11 జలాంతర్గాములను ముంచేసినట్లు తెలిపింది. లక్ష్యాలను ముందే నిర్దేశించుకొని యుద్ధాన్ని ప్రారంభించామని, అనుకున్న పని పూర్తి చేసేందుకు సంకల్పించామని పీట్ హెగ్‌సెత్ వెల్లడించారు.
అమెరికాపై యుద్ధభారం: అరాగ్చీ
రానున్న రోజుల్లో భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న క్రమంలో 200 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.18 లక్షల కోట్లు)పైగా నిధులు ఇవ్వాలని పార్లమెంట్‌కు చేసిన ప్రతిపాదనను ఆమోదించాలని పెంటగాన్ కోరింది. దీనిపై ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయిల్ అజెండా అమలునకు సొంత పౌరులపైనే అమెరికా భారం మోపుతోందని విమర్శించింది. ‘ఇరాన్, అమెరికాపై రుద్దిన ఈ యుద్ధం మొదలై మూడు వారాలు అయ్యింది. 200 బిలియన్ డాలర్లు అనేది చిన్న మొత్తమే. ఇజ్రాయిల్ అజెండా కోసం లక్షý కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. సామాన్య అమెరికన్లపైనే యుద్ధభారం పడుతోంది’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వ్యంగ్యంగా అన్నారు. ఈ యుద్ధం అమెరికాకు ఇష్టం లేదని అరాగ్చీ ఇటీవల పేర్కొన్నారు అమెరికాలోని కొందరు అధికారుల వల్ల అక్కడి పౌరులు ఈ యుద్ధ భారాన్ని మోస్తున్నారని వ్యాఖ్యానించారు.


