ఇంప్యాక్ట్ నిబంధన నాకు నచ్చదు: అక్షర్


న్యూదిల్లీ: ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్ ఐపీఎల్‌లోనూ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అక్షర్ ఈసారి జట్టుకు టైటిల్‌ను అందించేందుకు అవసరమైన వ్యూహాలు పన్నుతున్నాడు. మరో ఐదు రోజుల్లో పంతొమ్మిదో సీజన్ మొదలవ్వనున్న నేపథ్యంలో సహచరులతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్న అక్షర్ పటేల్… ‘ఇంప్యాక్ట్ ప్లేయర’ నిబంధనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అన్నీ ఒకే.. కానీ, ఈ ఒక్క నిబంధనే తనకు నచ్చదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ సన్నద్ధత, జట్టులో తన పాత్ర గురించి అక్షర్ పటేల్ మాట్లాడాడు. గత సీజన్‌లో తాను తక్కువగా బౌలింగ్ చేయడానికి కారణం ఇంప్యాక్ట్ ప్లేయర్ నియమం కారణంగా కాదని చెప్పాడు. ఈ నిబంధన తనకు అస్సలు నచ్చదన్నాడు. ‘మొదట్లో బ్యాటింగ్, బౌలింగ్‌కు పనికొస్తారని ఆల్‌రౌండర్లను తీసుకునేవారు. ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధన వచ్చాక స్పెషలిస్ట్ బ్యాటర్, బౌలర్‌ను మాత్రమే ఎంచుకుంటున్నారు. అలాంటప్పుడు ఆల్‌రౌండర్ల అవసరం ఏముంది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే.. నేను ఒక ఆల్‌రౌండర్‌ను అయినందు వల్ల నాకు ఈ నియమం అంటే ఇష్టముండదు. అయితే.. నియమాలేమీ మనం పాటించడానికేగా. కానీ, వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్‌ను వ్యతిరేకిస్తాను’ అని అక్షర్ పటేల్ వెల్లడించాడు. పద్దెనిమిదో సీజన్‌లో తాను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి తన వేలి గాయమే కారణమని అక్షర్ పటేల్ చెప్పాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *