ఇంధన సంక్షోభంపై ట్రంప్‌కి కనువిప్పు! – Visalaandhra


ఇరాన్‌ను తక్కువగా అంచనా వేసిన ట్రంప్ బృందం
తెలిసొస్తున్న వాస్తవం
వాషింగ్టన్: ఇంధన సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కనువిప్పు కలుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతిస్పందన విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సలహాదారుల లెక్కలు తప్పాయి. ఇరాన్‌ను ట్రంప్ బందం తక్కువ అంచనా వేసింది. ఇరాన్‌లో అధికార మార్పిడి ముందు యుద్ధం కారణంగా తలెత్తే సమస్యలు పెద్దవేమీ కాదనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితంగా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యూహాత్మక చమురు నిల్వలను బయటకు తీయాల్సి వస్తోంది.
ముందు చూపు ఉంటే..
ఇరాన్‌పై దాడులు చేయాలా.. వద్దా అనే సందిగ్ధంలో అధ్యక్షుడు ట్రంప్ ఉన్నప్పుడు.. దాడుల కారణంగా చమురుపై ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఇంధనశాఖ మంత్రి క్రిస్ వైట్ స్పష్టం చేశారు. యుద్ధంవల్ల పశ్చిమాసియాలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగబోదని, ఇంధన మార్కెట్లలో సంక్షోభం తలెత్తదని ధీమాగా చెప్పారు. గత ఏడాది జూన్‌లో ఇరాన్‌పై దాడులు చేసినప్పుడు స్వల్పంగా ఇంధన మార్కెట్లో ఒడిదొడుకులు చోటుచేసుకున్నాయని, ఆ తర్వాత వెంటనే సర్దుకున్నాయని ఉదహరించారు. కొంత మంది ట్రంప్ సలహాదారులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండోసారి దాడులు చేస్తే ఆర్థిక వ్యవస్థలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశముందన్న హెచ్చరికలను కొట్టిపారేశారు. ముందు చూపు ఉంటే…నేడు ఇంత సంక్షోభం జరిగి ఉండేది కాదు. ఇప్ప్పుడు చమురు కొరతతో ప్రపంచ దేశాలు సతమతమవుతున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం తర్జనభర్జనలు…
అమెరికన్లపై చమురు ధరల భారాన్ని తగ్గించడానికి ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటుందనే కొంత మంది ఆందోళనలే ఇప్పుడు నిజమయ్యాయి. హర్మూజ్ జల సంధిని ఆ దేశం మూసివేసింది. గతం కంటే ఈసారి రవాణా నౌకలపై భారీగా దాడులకు దిగుతోంది. దీంతో పర్షియన్ గల్ఫ్‌లో రవాణా పూర్తిగా స్తంభించింది. చమురు ధరలు పెరిగాయి.
హర్మూజ్ జల సంధిపై ప్రణాళిక లేకనే…
ట్రంప్ యంత్రాంగంలోని కొంత మంది అధికారులూ యుద్ధంపై నిరాశావాదంతోనే ఉన్నారు. అయితే వారు బహిరంగంగా స్పందించడం లేదు. యుద్ధంపై చట్టసభ సభ్యులకు ప్రభుత్వం వివరణ ఇచ్చాక కనెక్టికట్ డెమోక్రాట్ సెనేటర్ క్రిస్టోఫర్ ఎస్ మర్ఫీ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హర్మూజ్ జల సంధిపై ట్రంప్ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదని, దానిని తెరిపించడానికి ఏం చేయాలో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. హర్మూజ్ నుంచి నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ సీమైన్లను అమరుస్తోంది. దీంతో అమెరికా వాటిని అమర్చే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సి వచ్చింది. ప్రతిగా ఇరాన్.. నేరుగా రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *