మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం
. చైర్మన్ తిరస్కరణ… పోడియం ఎక్కి నినాదాలు
. అడుగడుగునా వాయిదాలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలి మంగళవారం దద్దరిల్లింది. దీనిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత మైకులు పనిచేయకపోవడంతో గంటపాటు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ మయ్యాక ఇందాపూర్ నెయ్యి అంశాన్ని వైసీపీ సభ్యులు మళ్లీ ప్రస్తావించారు. నినాదాలు, ప్లకార్డులతో గందరగోళం సష్టించారు. పోడియాన్ని చుట్టుముట్టారు. ‘నెయ్యి కల్తీ కల్తీ…బాబు పాలన కల్తీ కల్తీ… కూటమి పాలన కల్తీ కల్తీ..’అంటూ నినదిం చారు. సభ్యులకు సర్దిచెప్పడానికి చైర్మన్ ప్రయత్నించారు. తమ తమ సీట్లలో కూర్చోవాల్సిందిగా సూచించారు.
అయినా వైసీపీ సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. కొద్దిసేపటికి సభ తిరిగి సమావేశమయ్యాక చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తమ ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీ సభ్యులు మళ్లీ చైర్మన్ పోడియం ఎక్కి గందరగోళం సష్టించారు. గోవిందా… గోవిందా అంటూ నినదించారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య మంత్రులు సమాధానాలిచ్చారు. గందరగోళం మధ్య మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు లేవడంతో వైసీపీ సభ్యులు ఆందోళన ఆపారు. దీన్ని గమనించిన చైర్మన్… మంత్రులు మాట్లాడుతున్నప్ప్పుడు నినాదాలు చేసి… ప్రతిపక్ష నేత మాట్లాడేటప్ప్పుడు మౌనంగా ఉంటారా? ఇది పద్ధతి కాదన్నారు. వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మండలిని మరోసారి వాయిదా వేశారు. పదేపదే చెప్పినా వైసీపీ సభ్యుల ఆందోళన ఆగకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
The post ఇందాపూర్ నెయ్యిపై రగడ appeared first on Visalaandhra.


