Last Updated:
గూడూరు గ్రామం ఐస్‌క్రీమ్ బండ్లపై రూ.5000 జరిమానా విధిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు.
వామ్మో.. ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలం రాగానే పిల్లలు చల్లని పదార్థాలవైపు ఆకర్షితులవుతారని తెలుసుకున్న గ్రామస్థులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండి వస్తే రూ.5000 జరిమానా విధిస్తామని స్పష్టంగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని కేవలం మాటల్లోనే కాకుండా గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు.
ఈ ఆసక్తికర ఘటన గూడూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలవరం ప్రాంతానికి సమీపంలోని ఈ గ్రామంలో ప్రధానంగా గిరిపుత్రులు నివసిస్తున్నారు. ప్రకృతిని నమ్ముకుని జీవించే ఈ ప్రజలు ఇప్పటికీ సంప్రదాయ జీవన విధానాన్ని అనుసరిస్తూ అడవి దేవతను విశ్వసిస్తూ జీవిస్తున్నారు.
ఇటీవల గ్రామంలోని చిన్నారులు తరచుగా జ్వరం, దగ్గు, నీరసం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు పెద్దలు గమనించారు. ముఖ్యంగా వేసవిలో చల్లని పదార్థాలు, ముఖ్యంగా ఐస్‌క్రీమ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని భావించారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు.
దాని ప్రకారం గ్రామంలోకి ఎలాంటి ఐస్‌క్రీమ్ బండ్లు రావద్దని, ఒకవేళ ఎవరైనా వస్తే రూ.5000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా గ్రామస్తులు కూడా ఐస్‌క్రీమ్ కొనకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసి కఠినంగా పర్యవేక్షిస్తున్నారు.
గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం మార్కెట్లో లభించే ఐస్‌క్రీమ్‌లలో రసాయనాలు ఉండటం వల్ల పిల్లలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని భావిస్తున్నారు. జ్వరం, దగ్గు వంటి సాధారణ సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇక ఈ చర్యపై బయట ప్రాంతాల ప్రజలు కూడా స్పందిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. అదే సమయంలో గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చల్లని పదార్థాల వినియోగాన్ని తగ్గించడం వంటి విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. “మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది” అనే సందేశంతో ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


